పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన

27-10-2026 | 06:58pm

పిల్లల భద్రతపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి: జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి బాలభాస్కర్

మేడిపల్లి, అక్టోబర్ 27 (విజయక్రాంతి): పిల్లలకు పోక్సో చట్టం–2012పై(POCSO Act–2012) అవగాహన కల్పించడంతో పాటు, వారి భద్రత పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి బాలభాస్కర్ సూచించారు. మంగళవారం బోడుప్పల్ జిల్లా పరిషత్ పాఠశాలలో పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి బాలభాస్కర్, జిల్లా పోలీసు అధికారి ప్రియాంక, మేడిపల్లి పోలీస్ స్టేషన్ సీఐ డి. జలేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులకు పోక్సో చట్టంలోని ముఖ్యమైన నిబంధనలు, బాలలపై జరిగే లైంగిక నేరాలకు సంబంధించిన చట్టపరమైన అంశాలను వివరించారు.

పిల్లలు తమ శరీరంపై మంచి స్పర్శ, చెడు స్పర్శ మధ్య తేడాను గుర్తించాలని, ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, అనుచితంగా తాకినా భయపడకుండా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పోలీసులకు, వెంటనే సమాచారం అందించాలని సూచించారు. పిల్లలపై లైంగిక వేధింపులు జరగకుండా కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

18 ఏళ్లలోపు బాలబాలికలపై జరిగే లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించేందుకు పోక్సో చట్టం అమలులో ఉందని వివరించారు. మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్ కీలకంగా పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. వేధింపులకు గురైనవారు ఫిర్యాదు చేయడానికి భయపడాల్సిన అవసరం లేదని, తమకు ఎదురైన ఇబ్బందులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

బాలల హక్కులు, వారి రక్షణ, లైంగిక నేరాల నివారణపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, అనుమానాస్పద ఘటనలు, వేధింపులు గుర్తించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు