తెగలే.. తేలలే..!
- ఉద్యోగుల డిమాండ్లపై రాని స్పష్టత
- సీఎస్‌తో జేఏసీ నేతల చర్చలు అసంపూర్ణం
- పీఆర్సీ, డీఏలు, సీపీఎస్ రద్దుకు పట్టు
- పెండింగ్ బిల్లులు రూ.2 వేల కోట్లు ఇవ్వండి
- సీఎస్‌కు జేఏసీ నేతల విజ్ఞప్తి
- నేడు డిప్యూటీ సీఎంతో చర్చల తర్వాత నిర్ణయం ః సీఎస్
- తీవ్ర అసంతృప్తిలో ఉద్యోగులు
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాం తి): లక్షలాది మంది ఉద్యోగుల(Employees)ను ప్రభుత్వం ఊరించి.. ఉసూరుమనిపించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం తీపికబురు చెప్తుందని భావించిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ(Telangana Employees JAC) నేతలకు, ఉద్యోగులకు అసంతృప్తే మిగిలింది. సీఎస్‌తో జరిగిన చర్చలపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదో తూతూమంత్రం గా ఈ చర్చలు జరిగినట్లుగా ఉన్నాయనే భావన ఉద్యోగుల వ్యక్తమవుతోంది. పీఆర్సీ అమలు(Implementation of PRC), ఆరు డీఏలు, పెండింగ్ బిల్లులు, సీపీఎస్ రద్దు, ఈహెచ్‌ఎస్ అమలు తదితర డిమాండ్ల పరిష్కారానికి గానూ సోమవారం రాష్ట్ర సచివాలయం(State Secretariat)లో సీఎస్ సంజయ్ జాజు(Sanjay Jaju)తో మధ్యాహ్నం 3 గంటలకు జేఏసీ నేతలు సమావేశమయ్యారు.
ఎంతో ఆశతో జేఏసీ నేతలు ఈ సమావేశానికి వెళ్తే ఏ ఒక్క హామీపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన సమావేశం ఆలస్యంగానే ప్రారంభమైంది. ఉద్యోగుల ప్రధానమైన డిమాండ్ల లో పీఆర్సీ, ఐదు డీఏలు విడుదల, సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లులను ప్రతి నెల రూ.2 వేల కోట్లు విడుదల చేయాలనేవి ఉన్నాయి. అయితే వీటిపైన చర్చించకుండానే ఈహెచ్‌ఎస్ స్కీమ్‌పైనే సుధీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ప్రధాన డిమాండ్లపైన పెద్దగా చర్చనే జరగలేదని తెలిసింది.
కొన్ని నిమిషాలు మాత్రమే వీటిపై చర్చ జరిగినట్లు తెలిసింది. పీఆర్సీ అమలు చేయాలని, ప్రభుత్వానికి రిపోర్టు అందిందా? తెప్పించుకున్నా రా? అని జేఏసీ నేతలు సీఎస్‌ను అడగ్గా.... తొందర్లోనే తెప్పించుకుంటామని, దాన్ని పరిశీలించి క్యాబినెట్‌లో చర్చించి అప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీఎస్ బదులిచ్చినట్లుగా తెలిసింది. పెండింగ్ బిల్లు(Pending bill) ను రూ.2 వేల కోట్లు విడుదల చేసి, ఇందు లో 50 శాతం ఉద్యోగులకు, 50 శాతం పెన్షనర్లకు ఇవ్వాలని కోరారు.
సీపీఎస్ రద్దుకు మూడు నెలల అధ్యాయనానికి దాదాపు ఎనిమిది మందితో కమిటీ వేస్తామని చెప్పినట్లుగా తెలిసింది. పెండింగ్ డీఏలు ఐదు ఇవ్వాలని ప్రభుత్వాన్ని జేఏసీ నేతలు కోరడంతో ఈ అంశాలన్నింటి గురించి సీఎం, డిప్యూటీ సీఎంతో చర్చించి సోమవారం సాయంత్రం 7.30 గంటలకు మరోసారి సమావేశమవుదామని జేఏసీ నేతలకు సీఎస్ చెప్పారు.
అయతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తిరుపతిలో ఉండటంతో ఈ సమావేశాన్ని మంగళవారం సాయంత్రం 6 గంటలకు వాయిదా వేస్తున్నట్లు సీఎస్ కార్యాలయం నుంచి జేఏసీ నేతలకు సమాచారం అందడంతో ఇక చేసేది లేక జేఏసీ నేతలు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లారు. సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లిన త ర్వాతే తదుపరి సమావేశం ఉంటుందని సీఎ స్ కార్యాలయం వారికి పేర్కొన్నది. నేడు జరి గే చర్చలు సీఎస్‌తో ఉంటాయా? లేక డిప్యూ టీ సీఎంతో సీఎస్‌యే చర్చించి జేఏసీ నేతలతో సమావేశమవుతారా? అనేది స్పష్టత లేదని జేఏసీ నేతలు పేర్కొన్నారు.
అసంపూర్తిగానే చర్చలు..
ప్రభుత్వంతో చర్చలు ఇప్పటికే రెండు సా ర్లు వాయిదా పడ్డాయి. తొలుత ఈనెల 18న జరగాల్సిన చర్చలు అసెంబ్లీ సమావేశాల కారణంగా ఈనెల 21కి వాయిదా వేశారు. అయితే సోమవారం సీఎస్‌తో జరిగిన చర్చ లు అసంపూర్తిగానే ముగియడంతో మళ్లీ మంగళవారానికి వాయిదా వేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రె స్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శ లు ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి.
రాజకీయ అంశాలకు ప్రాదాన్యత ఇస్తుంది తప్ప ఉద్యోగులకు న్యాయంగా దక్కాల్సిన వాటిని ఈ సర్కారు పట్టించుకోవడంలేదని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం చర్చలు జరిపి హామీలు నెరవేర్చకుంటే ఉద్యమ బాట తప్పదని, తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని జేఏసీ నేతలు చెప్తున్నారు.