మస్క్‌కు పోటీగా అంబానీ
భూమి మీద టవర్లు సరిపోలేదా బాసూ.. ఇప్పుడు ఆకాశాన్నీ వదిలేలా లేరు! ఒకప్పుడు వీధికో సెల్ టవర్.. ఊరికో డేటా ప్లాన్‌తో టెలికాం రంగాన్ని షేక్ చేసిన దిగ్గజాలు ఇప్పుడు అంతరిక్షం వైపు చూస్తున్నాయి. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తన స్టార్‌లింక్‌తో ఆకాశంలో ఇంటర్నెట్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంటే.. ఇప్పుడు ముఖేష్ అంబానీ కూడా అదే బాటలో భారీ వ్యూహంతో రంగంలోకి దిగుతున్నారు. ఏకంగా 1,600 శాటిలైట్లను కక్ష్యలోకి పంపించాలన్న జియో ప్రణాళిక టెక్నాలజీ ప్రపంచంలో ఆసక్తి రేపుతోంది. భూమి మీద డేటా యుద్ధం చేసిన జియో.. ఇక అంతరిక్షంలోనూ తన ముద్ర వేయాలని చూస్తోంది!
ఇప్పటివరకు శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో స్టార్‌లింక్(Starlink) ప్రధాన పాత్ర పోషిస్తోంది. వేలాది శాటిలైట్లతో ప్రపంచవ్యాప్తంగా కనెక్టివిటీ అందిస్తున్న ఎలన్ మస్క్‌కు పోటీగా జియో సొంత శాటిలైట్ నెట్వర్క్(Satellite Internet) ను సిద్ధం చేస్తోంది. 2016లో జియో టెలికాం మార్కెట్లోకి వచ్చినప్పుడు డేటా ధరలు, పోటీ తీరు ఎలా మారిపోయాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అలాంటి పోటీనే శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలోనూ తీసుకురావాలన్నది జియో వ్యూహంగా కనిపిస్తోంది.
జియో రూపొందిస్తున్న ప్రణాళిక ప్రకారం 2027 సెప్టెంబర్‌లో తొలి ప్రయోగాత్మక మిషన్ (Experimental Mission) చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలుత కొద్దిపాటి శాటిలైట్లను పంపించి సాంకేతిక పనితీరును పరీక్షించనుంది. 2028 నుంచి విస్తృత స్థాయిలో ప్రయోగాలు ప్రారంభించి.. 2030 నాటికి 400 నుంచి 450 శాటిలైట్లను కక్ష్యలోకి పంపాలని భావిస్తోంది. పూర్తి స్థాయి 1,600 శాటిలైట్ల నెట్‌వర్క్‌ను 2035 నాటికి అందుబాటులోకి తీసుకురావాలన్నది లక్ష్యం.
ఇందులో కనీసం 400 శాటిలైట్లను అమెరికా నుంచి సమకూర్చుకునే అవకాశాలను పరిశీలిస్తుండగా.. మిగిలిన వాటి తయారీకి దేశీయ సంస్థలతో భాగస్వామ్యాలపై దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే ఆకాశంలో జియో జెండా ఎగరేయడానికి ఇప్పటి నుంచే భారీ కసరత్తు మొదలైందన్నమాట!
అయితే 1,600 శాటిలైట్లు అనగానే వాటిని తయారు చేయడం, రాకెట్లలో పంపించడం అంత ఈజీ కాదు. భారత్‌లో ప్రస్తుతం ఉన్న ఉపగ్రహ తయారీ సామర్థ్యం, ప్రయోగ వాహనాల లభ్యత, ఖర్చులు, కక్ష్యల కేటాయింపు వంటి అంశాలు ఈ ప్రాజెక్టుకు కీలకం కానున్నాయి. ఒక్కో శాటిలైట్ తయారీ నుంచి అంతరిక్షంలో దాని నిర్వహణ వరకు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. అందుకే జియో దేశీయ అంతరిక్ష సంస్థలు, ప్రైవేట్ కంపెనీలతో కలిసి పనిచేసే అవకాశాలను పరిశీలిస్తోంది.
ఇక అసలు ప్రశ్న.. ఈ స్పేస్ ఫైట్ వల్ల సామాన్యుడికి ఒరిగేదేంటి? మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాలు, దీవులు, సరిహద్దు ప్రాంతాలు, సముద్ర ప్రయాణాల్లోనూ ఇంటర్నెట్ అందించడం శాటిలైట్ కనెక్టివిటీ ప్రధాన లక్ష్యం. సాధారణ సెల్ టవర్లు ఏర్పాటు చేయడం కష్టమైన ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ చేరే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో మొబైల్ పరికరాలకు నేరుగా శాటిలైట్ కనెక్టివిటీ అందించే అవకాశాలపైనా జియో ప్రణాళికలో దృష్టి ఉంది.
అయితే ఇదేదో రేపటి నుంచే రూ.299 రీఛార్జ్‌తో అంతరిక్ష ఇంటర్నెట్ వచ్చేస్తుందని అనుకోవద్దు. శాటిలైట్ ఇంటర్నెట్కు ప్రత్యేక పరికరాలు, సాంకేతిక సదుపాయాలు, భారీ పెట్టుబడులు అవసరం. ధరలు, వాణిజ్య సేవల ప్రారంభ తేదీలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పోటీ పెరిగితే వినియోగదారులకు ధరలు, సేవల నాణ్యత పరంగా ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది.
ఒకప్పుడు టవర్ల కోసం పోటీ.. ఇప్పుడు శాటిలైట్ల కోసం పోటీ! ఒకవైపు మస్క్ స్టార్‌లింక్.. మరోవైపు అంబానీ జియో.. ఇంకోవైపు అమెజాన్ వంటి సంస్థలు కూడా శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో అడుగులు వేస్తున్నాయి. దీంతో ప్రపంచ టెలికాం రంగంలో కొత్త పోటీ మొదలైంది. ఇప్పటివరకు మనం ఫోన్లో సిగ్నల్ కోసం టవర్ వైపు చూసేవాళ్లం. రేపు ఆకాశం వైపు చూసే రోజులు రావొచ్చు! మస్క్ చుక్కలతో ఇంటర్నెట్ అల్లుతుంటే.. అంబానీ కూడా తన శాటిలైట్లతో అంతరిక్షంలో కొత్త నెట్వర్క్ నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ స్పేస్ వార్తో సామాన్యుడి ఇంటర్నెట్ బిల్లు తగ్గుతుందా? లేక ఆకాశాన్ని తాకుతుందా? కాలమే చెప్పాలి!