భద్రాచలంలో మహర్షి వాల్మీకి ఆలయం నిర్మించాలి
దేవస్థానం ఈవో దామోదర్ రావుకి వినతి పత్రం అందజేత
భద్రాచలంలో ఘనంగా వాల్మీకి బోయల కార్తీక వనభోజనాల కార్యక్రమం
వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప
భద్రాచలం, (విజయక్రాంతి): భద్రాచలం(Bhadrachalam) శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన ప్రాంగణంలో ఆదికవి మహర్షి వాల్మీకి ఆలయాన్ని నిర్మించి, ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తెలంగాణ రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప కోరారు. భద్రాచలంలో నిర్వహించిన వాల్మీకి బోయల కార్తీక వనభోజనాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం రాష్ట్ర, జిల్లా స్థాయి వాల్మీకి బోయ నాయకులు, సామాజికవర్గ ప్రతినిధులతో కలిసి దేవస్థాన కార్యనిర్వహణాధికారి, ఆలయ అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. రామాయణ మహాకావ్యాన్ని రచించిన ఆదికవి మహర్షి వాల్మీకికి భద్రాచల పుణ్యక్షేత్రంలో సముచిత స్థానం కల్పించాలని కోరారు. దేశవ్యాప్తంగా భద్రాచలాన్ని సందర్శించే భక్తులకు వాల్మీకి చరిత్ర, ఆధ్యాత్మిక విశిష్టతను తెలియజేసేలా ఆలయ నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రతిపాదనను దేవస్థాన అధికారులు, పాలకమండలి పరిశీలించి ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠాపనకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మైన్స్ డైరెక్టర్ వీడీ రాజగోపాల్, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బి. కృష్ణమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. వెంకటరమణ, రాష్ట్ర నాయకుడు జి. వెంకటరమణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు ఎం. వెంకన్న, శ్రీనివాస్, సతీష్ తదితర రాష్ట్ర, జిల్లా నాయకులు, వాల్మీకి బోయ సామాజికవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. భద్రాచలంలో వాల్మీకి ఆలయ నిర్మాణం జరిగితే వాల్మీకి బోయ సమాజంతో పాటు భక్తులందరికీ గర్వకారణంగా నిలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.