బోడు ప్రాంతానికి పీఏసీఎస్ ఏర్పాటు చేయాలి
ఏర్పాటు చేసే వరకు అఖిలపక్ష పోరాటం
ఎమ్మెల్యే కోరం కనకయ్యను కలిసి సమస్య వివరిస్తాం
టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బోడు ప్రాంత రైతుల సౌకర్యార్థం బోడు కేంద్రంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(Primary Agricultural Cooperative Society) ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం బోడు గ్రామంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పీఏసీఎస్ ఏర్పాటు అంశంపై చర్చించారు.
బోడు సొసైటీ పరిధిలోని బోడు, కొప్పురాయి, గంగారం రెవెన్యూ గ్రామాలను కలుపుతూ బోడు కేంద్రంగా నూతన పీఏసీఎస్ ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది. ఈ డిమాండ్ సాధించే వరకు అన్ని రాజకీయ పక్షాలు ఐక్యంగా పోరాటం చేయాలని నిర్ణయించారు. స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యను కలిసి రైతుల సమస్యలు, పీఏసీఎస్ ఆవశ్యకతను వివరించి తమ విజ్ఞప్తిని తెలియజేయాలని తీర్మానించారు. సమావేశంలో అఖిలపక్ష నాయకులు, రైతులు పాల్గొన్నారు.