ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రనా లేక మంత్రి పదవిని కాపాడుకునే యాత్రనా
కరీంనగర్ సిటీ నవంబర్ 22 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే వాళ్లే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని ర్యాలీలు నిర్వహించడం ఈ దేశ రాజకీయాల్లోనే అతిపెద్ద విడ్డూరమని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) చేపడుతున్న యాత్ర ఒక నాటకమని, ఎంపీగా గెలిచి కరీంనగర్ కు ఏమీ చేయలేక విఫలమయ్యారని, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న రాజకీయ డ్రామా అని కాంగ్రెస్ ఆరోపించింది.
ఈ సందర్భంగా అర్బన్ డీసీసీ అధికార ప్రతినిధి ఆకుల ఉదయ్ మాట్లాడుతూ... ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ప్రచార ఆర్భాటాలు కాదు. ప్రజల ఓటు హక్కును, రాజ్యాంగ విలువలను, స్వతంత్ర సంస్థల గౌరవాన్ని కాపాడే నిజాయితీ!" ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు నిర్వహించడం, అధికారంలో కొనసాగడం మాత్రమే కాదని, ప్రతిపక్షాల గొంతును గౌరవించడం, పార్లమెంటులో చర్చలకు అవకాశం కల్పించడం, రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను కాపాడటం, పౌరుల హక్కులను గౌరవించడం కూడా ప్రజాస్వామ్యంలో అంతర్భాగాలని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కోరుతూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పాలని, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, యువత భవిష్యత్తు వంటి ప్రజా సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కరీంనగర్ వచ్చి యాత్ర చేస్తున్నారని, అయితే ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది ప్రసంగాలకు, ర్యాలీలకు మాత్రమే పరిమితం కాకూడదని, అధికారంలో ఉన్నవారి పాలనలోనూ, రాజకీయ వ్యవహారశైలిలోనూ అది ప్రతిబింబించాలని అన్నారు.
ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యానికి శత్రువు కాదని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యతని, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడం అధికార పక్షం బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్ర్య పోరాటం నుంచి రాజ్యాంగ నిర్మాణం వరకు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో కీలక పాత్ర పోషించిందని, రాజ్యాంగం, లౌకికవాదం, సమానత్వం, పౌర హక్కులు, ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రత కోసం కాంగ్రెస్ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్యం బీజేపీ సొంత ఆస్తి కాదు. అది 140 కోట్ల భారతీయుల హక్కు! రాజ్యాంగం రాజకీయ ప్రచారానికి ఉపయోగించే పుస్తకం కాదు. అది భారతదేశానికి పునాది ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని నినాదాలు చేయడం సులభం.. ప్రజల గొంతును వినడం, వారి హక్కులను గౌరవించడం, రాజ్యాంగాన్ని కాపాడటం అసలైన ప్రజాస్వామ్యం!" అని ఆకుల ఉదయ్ పేర్కొన్నారు.