ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి
మంటలార్పి కాపాడేందుకు తీవ్రంగా శ్రమించిన చేర్యాల ఎస్ఐ అపూర్వ రెడ్డి
తీవ్ర గాయాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన బాధితుడు
చేర్యాల, నవంబర్ 22 : కుటుంబ కలహాల నేపథ్యంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఓ యువకుడు మృత్యువు తో పోరాడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మంటల్లో చిక్కుకున్న యువకుడిని రక్షించేందుకు చేర్యాల ఎస్ఐ గూడ అపూర్వ రెడ్డి(Cherial SI Guda Apurva Reddy) తన ప్రాణాలకు తెగించి ప్రయత్నించినప్పటికీ, తీవ్రంగా కాలిపోవడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. జనగామ జిల్లా(Jangaon District) బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి(Nagireddipalli village) చెందిన రమేష్ అనే యువకుడు శుక్రవారం చేర్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ ప్రధాన రహదారి పక్కన గల కేపీఆర్ కాలనీ వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
అదే సమయంలో అటుగా వెళ్తున్న చేర్యాల ఎస్ఐ అపూర్వ రెడ్డి, మంటలతో హాహాకారాలు చేస్తున్న యువకుడిని గమనించి వెంటనే స్పందించారు.ఏమాత్రం ఆలస్యం చేయకుండా, స్థానికుల సహాయంతో గోనె సంచులు కప్పి మంటలను ఆర్పివేశారు. అనంతరం తీవ్ర గాయాలపాలైన రమేష్‌ను హుటాహుటిన చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి మరింత విషమించి ఆదివారం రమేష్ మృతి చెందాడు.యువకుడు మరణించడం స్థానికంగా విషాదాన్ని నింపినప్పటికీ,మంటల్లో కాలిపోతున్న వ్యక్తిని కాపాడేందుకు ఎస్ఐ అపూర్వ రెడ్డి క్షణాల్లో స్పందించి, ప్రాణాలకు తెగించి చేసిన సాహసోపేత ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.