మెడికోల సమస్యల పరిష్కారానికి చర్యలు
- ఆరోగ్యశాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా మంత్రుల చొరవతో పనుల్లో వేగం
కరీంనగర్, నవంబరు 22 (విజయక్రాంతి): కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల(Karimnagar Government Medical College) విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కళాశాల భవన నిర్మాణ పనులతో పాటు బాలురు, బాలికల వసతి గృహాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించింది. కొత్త వైద్య కళాశాల భవన నిర్మాణం పూర్తికావడానికి మరో ఆరు నెలల సమయం పట్టనుండగా, హాస్టళ్లను మాత్రం మరో 15 రోజుల్లో విద్యార్థులకు అప్పగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థులకు నిరంతర విద్యుత్ సరఫరా కల్పించేందుకు ఎన్పీడీసీఎల్కు 19 లక్షలు మంజూరు చేశారు. ఈ పనులను సోమవారం ప్రారంభించనున్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కళాశాలకు నీటి సరఫరా కల్పించేందుకు 85 లక్షల అవసరాన్ని గుర్తించారు. గత వారం పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి నిధుల మంజూరుకు చర్యలు చేపట్టారు. వైద్య కళాశాల భవన నిర్మాణాన్ని ఆర్అండ్బీ శాఖ చేపడుతోంది. బాలురు, బాలికల హాస్టల్ భవనాలను రానున్న రెండు వారాల్లో అప్పగించాలని ఆర్అండ్బీ అధికారులు కాంట్రాక్టర్కు సూచించారు. లిఫ్ట్ సదుపాయంతో పాటు అవసరమైన కార్యాచరణ సామగ్రిని ఏర్పాటు చేసి అప్పగించనున్నారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఇన్వర్టర్లు, ఏసీలను కూడా సమకూర్చేందుకు నిధులు మంజూరు చేస్తున్నారు.
- మంత్రుల చొరవ.. కలెక్టర్ పర్యవేక్షణ..
రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశాలతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రుల చొరవతో మెడికల్ కళాశాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. విద్యార్థులు ప్రస్తుతం ఉంటున్న హాస్టళ్లను జిల్లా కలెక్టర్ గతంలో సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా హాస్టలను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారుల ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థుల విజ్ఞప్తులను కళాశాల ప్రిన్సిపాల్, వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) స్వీకరించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్లో ఉన్న టోకెన్ల అంశాన్ని కూడా ఉన్నతాధికారులకు నివేదించారు. డీఎంఈ, జిల్లా కలెక్టర్ ఈ అంశాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
- వైద్య కళాశాలను సందర్శించిన ఆర్డిఓ
వైద్య కళాశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, పెండింగ్లో ఉన్న సమస్యలను పరిశీలించేందుకు కరీంనగర్ ఆర్డీఓ ప్రిన్సిపాల్ మెడికల్ కాలేజీతో కలిసి తాజాగా ఆదివారం కళాశాలను సందర్శించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి, విద్యార్థుల అవసరాలు, వసతుల కల్పనపై వివరాలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను సమీక్షించారు. ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాలలోనూ విద్యుత్ సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. నర్సింగ్ కళాశాలకు విద్యుత్ సరఫరా పనుల కోసం టీఎస్ఎంఐడీసీ ఈఈ ద్వారా ఎన్పీడీసీఎల్కు 11.40 లక్షలు మంజూరు చేశారు.