నిజాయితీ చాటిన ఆర్టీసీ కండక్టర్
ప్రయాణికుడి రూ.5 వేల నగదు, విలువైన పత్రాలు సురక్షితంగా అప్పగింత
ఇల్లెందు,(విజయక్రాంతి): బస్సులో దొరికిన రూ.5 వేల నగదు, విలువైన పత్రాలతో కూడిన కవర్‌ను ప్రయాణికుడికి తిరిగి అప్పగించి ఇల్లందు ఆర్టీసీ డిపో(Illandu RTC Depot) కండక్టర్ వెంకటేశ్వర్లు నిజాయితీ చాటుకున్నారు. పది రోజుల క్రితం ఇల్లందు–కొత్తగూడెం షెడ్యూల్ సర్వీసులో డ్రైవర్ బానోతు ప్రవీణ్, కండక్టర్ వెంకటేశ్వర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు తన కవర్‌ను బస్సులోనే మరిచిపోయి దిగిపోయాడు. డ్యూటీ అనంతరం బస్సులోని సీట్లను తనిఖీ చేస్తుండగా కండక్టర్ వెంకటేశ్వర్లుకు కవర్ కనిపించింది. వెంటనే దానిని ఇల్లందు డీఎం వి. సుభాషిణి(Illandu DM V. Subhashini)కి అప్పగించారు.
కవర్‌లోని పత్రాల ఆధారంగా ప్రయాణికుడి వివరాలను గుర్తించిన డీఎం, వాటిని స్థానిక వాట్సాప్, సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారం చేయడంతో బాధితుడి ఆచూకీ లభించింది. సోమవారం ఇల్లందు డిపోలో సూపర్వైజర్ సునీత, సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలో రూ.5 వేల నగదు, విలువైన పత్రాలతో కూడిన కవర్‌ను ప్రయాణికుడికి అప్పగించారు. పోగొట్టుకున్న నగదు, పత్రాలు తిరిగి లభించడంతో బాధితుడు కండక్టర్ వెంకటేశ్వర్లుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నిజాయితీని డిపో సిబ్బంది, ప్రయాణికులు అభినందించారు.