ఓటు హక్కుపై దాడిని తిప్పికొడదాం

08-10-2026 | 11:09pm

రాజ్యాంగ వ్యవస్థల రక్షణకు సమిష్టిగా పోరాడదాం

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

'సర్'కు నిరసనగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో భారీ ర్యాలీ

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేసే పాలకుల అణచివేత చర్యలను ప్రజాతంత్ర శక్తులు ఐక్యంగా తిప్పికొట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా పిలుపునిచ్చారు. సర్ ప్రక్రియను తక్షణమే నిలుపుదల చేయాలని, ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను భర్తరఫ్ చేయాలని, అక్రమంగా తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, న్యూ డిమోక్రసీ, మాస్ లైన్, జనసమితి పార్టీల ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని ఓల్డ్ డిపో సెంటర్ నుంచి  ప్రజాస్వామ్య పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. అనంతరం రైల్వే స్టేషన్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు.

రాజ్యాంగం కల్పించిన పౌరుల ప్రాథమిక ఓటు హక్కును కాలరాసే విధంగా సాగుతున్న సర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలన్నారు. వివాదం సుప్రీం కోర్టు పరిధిలో ఉండగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం గర్హనీయమని, తొలగించిన అర్హుల ఓట్లను వెంటనే చేర్చకపోతే రాజీలేని ఉద్యమాలు నిర్మిస్తామని శ్రమజీవుల, పీడిత ప్రజల కనీస రాజకీయ హక్కు అయిన ఓటును సర్ ప్రక్రియ ద్వారా కొల్లగొట్టే కుట్ర సాగుతోందని, పాలకవర్గాల అడుగులకు మడుగులొత్తుతూ పనిచేస్తున్న ఎన్నికల కమిషనర్‌ను పదవి నుంచి తొలగించడమే ప్రజాస్వామ్యానికి రక్ష అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దేవి లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ..ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఓటు హక్కును నిర్వీర్యం చేసే కుట్రలను ప్రజాతంత్ర శక్తులు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. చట్టబద్ధమైన నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా చేపట్టిన సర్ ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ ప్రజల హక్కులను హరిస్తున్నారని, ఆయనను వెంటనే విధుల్లోంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో

సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ మూడ్ గణేష్, మాస్ లైన్, న్యూ డెమోక్రసీ, జన సమితి నాయకులు కేచ్చల రంగారెడ్డి, గౌని నాగేశ్వరరావు, కవిత, దేవదానం తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతూ..ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతను కోల్పోయి ఏకపక్షంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. అక్రమంగా అర్హుల ఓట్లను జాబితాల నుండి తొలగించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శించారు. 

మేయర్ మూడ్ గణేష్, మాస్ లైన్, న్యూ డిమోక్రసీ,  జనమితి నాయకులు కెచ్చల రంగారెడ్డి,  గౌని నాగేశ్వర్ రావు, కవిత, దేవదానం మాట్లాడుతూ.. సాంకేతికత పేరిట సామాన్య పౌరుల ఓట్లను గల్లంతు చేయడం ముమ్మాటికీ ప్రజాద్రోహమేనని మండిపడ్డారు. దేశంలో ఎన్నికల నిర్వహణ అత్యంత పారదర్శకంగా జరగాల్సిన చోట, ఇలాంటి అనుమానాస్పద సర్వేలను తెరపైకి తేవడం దారుణమన్నారు. సుప్రీం కోర్టులోని కేసుల విచారణను పరిగణనలోకి తీసుకోకుండా మొండిగా ముందుకెళ్లడం పాలకుల అహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.  తక్షణమే ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను భర్తరఫ్ చేసి సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని కోరారు.

అక్రమ తొలగింపులకు గురైన ప్రతి ఒక్కరి ఓటును మళ్లీ జాబితాలో చేర్చేదాకా ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగ సీతారాములు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర నాయకులు ఏజే రమేష్, సిపిఐ జిల్లా నాయకులు కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, కమటం వెంకటేశ్వరరావు, జి వీరాస్వామి, ఉప్పుశెట్టి రాహుల్, ఎస్ కె ఫహీమ్,  ఎమ్మెల్ పార్టీల జిల్లా నాయకులు ముద్దా బిక్షం, తుపాకుల నాగేశ్వరరావు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఎమ్మెల్ పార్టీల నాయకులు  అన్నవరపు సత్యనారాయణ, బ్రహ్మ చర్య, భూక్యా రమేష్, కొత్వాల శ్రీను, సిరిపురపు లలిత, మండే హన్మంతరావు, ఆళ్ల మురళి, ఉమర్, సీతారామయ్య, సారంగపాణి, జాటోత్ కృష్ణ, గోపాలరావు, అమర్లపూడి రాము స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు