లాభాల కోసం ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టొద్దు
ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ఇసుక ర్యాంపులను సంపూర్ణంగా రద్దు చేయాలి
లోక్ రక్షక్ పార్టీ వ్యవస్థాపకులు కొండా చరణ్
భద్రాచలం, (విజయక్రాంతి): ఇసుక ర్యాంపుల వల్ల కొద్దిమందికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతుండగా, వేలాది మంది ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని లోక్ రక్షక్ పార్టీ వ్యవస్థాపకులు కొండా చరణ్ అన్నారు. భద్రాచలంలోని హరిత హోటల్లో లోక్ రక్షక్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఇసుక ర్యాంపుల రద్దును కోరుతూ రూపొందించిన కరపత్రాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక లారీల నిరంతర రాకపోకలతో వెలువడుతున్న దుమ్ము, ధూళి కారణంగా ప్రజలు ఆస్తమా, శ్వాసకోశ, చర్మ, కంటి సంబంధిత అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రహదారులకు ఇరువైపులా ఉన్న పండ్ల తోటలు, పంట పొలాలపై దుమ్ము పేరుకుపోవడంతో రైతులు పంట దిగుబడులు కోల్పోయి ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక బరువుతో ప్రయాణిస్తున్న ఇసుక లారీల కారణంగా రహదారులు ధ్వంసమై గుంతలమయంగా మారుతున్నాయని, ఆటోలు, మ్యాజిక్ కార్లు, ఇతర వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతూ సామాన్యులపై అదనపు భారం పడుతోందన్నారు.
అత్యవసర సమయాల్లో అంబులెన్సులు సైతం సకాలంలో చేరలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని, లారీల అధిక వేగంతో ప్రమాదాలు జరిగి అమాయకులు, మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని పేర్కొన్నారు. విచ్చలవిడిగా జరుగుతున్న ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలపై ప్రభావం పడటమే కాకుండా బోర్లు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ నాయకులు కొండా ప్రమోద్, పార్టీ డివిజన్ నాయకులు, ఉమా మహేశ్వరరావు, జక్క వెంకటేశ్వర్లు , చింతల సాయి వన్నాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.