కూరగాయల్లో అంటుకట్టే విధానం

06-11-2026 | 07:59pm

భవిష్యత్తు అవకాశాలపై రైతులకు శిక్షణా కార్యక్రమం..

ఉట్నూర్, నవంబర్ 06 (విజయక్రాంతి): సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ  ఉట్నూర్ మరియు ఉద్యాన శాఖ, ఆదిలాబాద్ జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ ఉద్యాన అభివృద్ధి మిషన్ (MIDH) పథకం కింద ఈరోజు PMRC సమావేశ మందిరం, కేబి కాంప్లెక్స్, ఉట్నూర్ లో కూరగాయల్లో అంటుకట్టే విధానం - భవిష్యత్తు అవకాశాలు"అనే అంశంపై గిరిజన యువ రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి  మంద మకరందు(Manda Makarandu), ప్రాజెక్టు అధికారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 70 మంది గిరిజన యువత పాల్గొన్నారు. వీరిలో ఆసక్తి కలిగిన 45 మంది గిరిజన ఆదివాసీ మహిళలకు కూరగాయల మొక్కల్లో అంటు కట్టటానికి వారం రోజులు హైద్రాబాద్ లోని కన్హా శాంతివనంలో శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి  మాట్లాడుతూ, గిరిజన యువత ఆధునిక వ్యవసాయ పద్ధతులను నేర్చుకొని స్వయం ఉపాధి పొందాలని, కూరగాయల గ్రాఫ్టింగ్ వంటి నూతన సాంకేతికతతో తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం పొందవచ్చని తెలిపారు. ITDA ద్వారా యువతకు అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఐటీడీఏ ప్రాజెక్ట్ ఉద్యాన అధికారి జిల్లా ఉద్యాన అధికారి గుడిమళ్ల సందీప్ కుమార్  మాట్లాడుతూ, గ్రాఫ్టింగ్ వల్ల నేల ద్వారా వచ్చే తెగుళ్లు, వేరుకుళ్లు రావని, దిగుబడి 30% - 40% పెరుగుతుందని, కరువును తట్టుకునే శక్తి పెరుగుతుందని వివరించారు. టమాట, వంకాయ, దొండ, కాకరకాయ వంటి పంటలలో గ్రాఫ్టింగ్ చాలా లాభదాయకమని తెలిపారు. హైద్రబాద్ కన్హా శాంతి వనం నుండి శివ, ఉద్యాన పరిశోధనా స్థానం, ఆదిలాబాద్ నుండి డా. మల్లేష్ గ్రాఫ్టింగ్ చేసే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించి, దాని ప్రాముఖ్యతను వివరించారు.

ఈ శిక్షణ తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, భవిష్యత్తులో గ్రాఫ్టింగ్ నర్సరీలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతామని పాల్గొన్న యువత ITDA కు మరియు ప్రాజెక్టు అధికారి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ సిబ్బంది మహేందర్, భూమయ్య, అర్షిత,CPF NGO సిబ్బంది నుండి సత్యనారాయణ, షారుక్, దిలీప్, న్యాను, పూజ, సుదర్శన్, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు