గుడిపేట రాబరీ కేసును ఛేదించిన పోలీసులు
- ఇద్దరి అరెస్ట్.. మరొకరి కోసం గాలింపు
- బంగారు పుస్తెలతాడు లాక్కెళ్లిన ముఠా పట్టివేత..
- బంగారు ముద్దలు, రెండు స్కూటీలు, సెల్ఫోన్లు స్వాధీనం
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): మంచిర్యాల(Mancherial) జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలో ఒంటరిగా ఉన్న మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడును అపహరించిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు బుధవారం వెల్లడించారు. గుడిపేట గ్రామానికి చెందిన లగిశెట్టి దేవక్క ఈ నెల 2న ఉదయం ఇంటి ముందు ఉండగా స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు రాకేశ్ ఇంటి చిరునామా అడిగారు. అనంతరం ఆమెను ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకుని, గొంతు పట్టుకుని, అరిస్తే చంపుతామని బెదిరించారు. మెడలోని బంగారు పుస్తెలతాడును బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో హాజీపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆర్థిక ఇబ్బందులు, అప్పుల కారణంగా ముత్యబోయిన ప్రేమ్ చందు, డోలె చంద్రకాంత్ దొంగతనానికి పథకం వేశారు. ఈ క్రమంలో గుడిపేటలో ఒంటరిగా ఉన్న దేవక్కను గుర్తించి పుస్తెలతాడును అపహరించారు. అనంతరం చాకటి అనిల్ కుమార్‌కు ఫోన్ చేసి బంగారాన్ని కరిగించేందుకు ఒప్పందం చేసుకున్నారు. మంచిర్యాల ఆర్పీ రోడ్డులోని తన వర్క్‌షాప్‌లో అనిల్ కుమార్ పుస్తెలతాడును కరిగించి మూడు బంగారు ముద్దలుగా తయారు చేశాడు. వాటిని ముగ్గురూ పంచుకున్నారు.
ఈ కేసులో డోలె చంద్రకాంత్ (32), చాకటి అనిల్ కుమార్ (35)లను పోలీసులు అరెస్టు చేశారు. ముత్యబోయిన ప్రేమ్ చందు పరారీలో ఉన్నాడు. అరెస్టయిన వారిని న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. చంద్రకాంత్ వద్ద ఒక బంగారు ముక్క, సుజుకి అవెనిస్ స్కూటీ, రెడ్మీ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనిల్ కుమార్ వద్ద ఒక బంగారు ముక్క, హోండా యాక్టివా స్కూటీ, శామ్సంగ్ సెల్‌ఫోన్, బంగారు ఆభరణాల తయారీకి ఉపయోగించే మూస, పట్టుకారును స్వాధీనం చేసుకున్నారు.
మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం, పోలీసుల నిఘాతో కేసును ఛేదించారు. దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన మంచిర్యాల రూరల్ సీఐ జి. రవీందర్, హాజీపూర్ ఎస్ఐ డి. కిరణ్ కుమార్, సీసీసీ నస్పూర్ ఎస్ఐ-2 టీ. జితేందర్ సింగ్, ఏఎస్ఐ ఎం.డి. ఇజాజ్‌తో పాటు పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.