దారిత‌ప్పుతున్న జ‌ర్న‌లిజం!

05-11-2026 | 12:02am

ప్ర‌తి జ‌ర్న‌లిస్టు ఆత్మపరిశీలన చేసుకోవాలి

న‌కిలీ జ‌ర్న‌లిస్టుల‌ను అరిక‌ట్టాల్సిన బాధ్య‌త మ‌న‌దే..

రాష్ట్ర ప్రెస్ అకాడ‌మీ చైర్మ‌న్ శ్రీ‌నివాస్‌రెడ్డి

రామ‌చంద్రాపురం, న‌వంబ‌ర్ 4: నకిలీ జర్నలిస్టుల బ్లాక్‌మెయిలింగ్‌ను అరికట్టాల్సిన బాధ్యత మనపైనే ఉంద‌ని, జర్నలిజం వృత్తిలో మనం దారి తప్పుతున్నామా అని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి(Press Academy Chairman Srinivas Reddy) సూటిగా ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ స‌మావేశానికి ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 66 మంది అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 100 మంది కార్యవర్గ సభ్యులతో అతిపెద్ద సంఘంగా ఉన్న టియుడబ్ల్యు జె- ఐజెయు యూనియన్ ప్రతి జర్నలిస్టు సమస్యను క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కరించే దిశగా పనిచేయాలని సూచించారు. కింది స్థాయి వరకు ప్రతి సమస్యపై స్థానిక నాయకత్వం బాధ్యత తీసుకోవడమే నిజమైన నాయకత్వ లక్షణమని పేర్కొన్నారు.

ప్రస్తుతం సమాజంలో జర్నలిస్టులకు గతంలో ఉన్న గౌరవం ఎందుకు తగ్గిందో ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. పత్రికా యాజమాన్యాలు తమ విధానాలకు అనుగుణంగా సంస్థ అభివృద్ధి కోసం పనిచేస్తాయని జర్నలిజాన్ని వృత్తిగా స్వీకరించిన జర్నలిస్టులు మాత్రం వృత్తి నిబద్ధతను కాపాడుకుంటూ ప్రజా సమస్యలను ప్రశ్నిస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా జర్నలిస్టుల హక్కులు సమస్యల విషయంలో సంఘం లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జర్నలిస్టులు తమ సమస్యలను ధైర్యంగా ప్రశ్నించాలని వారికి సంఘం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు అవసరమైతే రోడ్డుపైకి వచ్చి పోరాటం చేయడానికి కూడా వెనుకాడకూడదని అన్నారు. అదేవిధంగా జర్నలిస్టుల పేరుతో చెలామణి అవుతూ నకిలీ గుర్తింపులతో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న వారిని అరికట్టాల్సిన బాధ్యత కూడా జర్నలిస్టు సంఘాలపైనే ఉందన్నారు. నిజమైన జర్నలిస్టుల గౌరవం, వృత్తి ప్రతిష్ట దెబ్బతినకుండా నకిలీ జర్నలిస్టులపై సంఘటితంగా చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.

వృత్తి విలువలను కాపాడుకోవాలి..

ఐజేయూ నేత దేవులపల్లి అమర్

ప్ర‌తీ జ‌ర్న‌లిస్టు త‌న వృత్తి విలువ‌ల‌ను కాపాడుకోవాల‌ని ఐజేయూ నేత దేవుల‌ప‌ల్లి అమ‌ర్ సూచించారు. ప్రభుత్వాలపై గతంలో మాదిరిగా ఒత్తిడి తీసుకువచ్చే పరిస్థితులు ప్రస్తుతం లేవన్నారు. మారిన రాజకీయ,  సామాజిక పరిస్థితుల్లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘాలు మరింత బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాం వరకు జర్నలిస్టు సంఘాల కృషి ఫలితంగా హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలు అమలయ్యేవని గుర్తుచేశారు.

ప్రస్తుతం ప్రభుత్వం జర్నలిస్టులకు ఆరోగ్య బీమా సదుపాయాన్ని అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.హెల్త్ కార్డులు నిరుపయోగంగా మారడానికి కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. దీంతో ఆయా ఆసుపత్రులు జర్నలిస్టులకు వైద్య సేవలు అందించేందుకు నిరాకరిస్తున్నాయని తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలను జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీపావళి సందర్భంగా అర్హతను బట్టి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సూచించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంఖ్య భారీగా ఉండటంతో ఈ హామీ అమలు సాధ్యాసాధ్యాలపై ప్రస్తుతానికి స్పష్టత లేదన్నారు.

హ‌క్కుల సాధ‌న‌కు ఐక్యంగా పోరాడాలి

రాష్ట్ర అధ్య‌క్షుడు విరాహ‌త్ అలీ

జర్నలిస్టుల ఐక్యతను బలోపేతం చేసి హక్కుల సాధనకు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర అధ్య‌క్షుడు విరాహ‌త్ అలీ పిలుపునిచ్చారు. జర్నలిజం వృత్తిలో మహిళా జర్నలిస్టుల సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉందని అందుకు అనుకూలమైన అవకాశాలు వెసులుబాట్లు కల్పించడం జర్నలిస్టు సంఘాల బాధ్యత అని పేర్కొన్నారు. 

భావప్రకటనా స్వేచ్ఛ ఉందని ప్రతి అంశాన్ని సోషల్ మీడియా యూట్యూబ్ వేదికలపై ప్రచురించడం మాత్రమే జర్నలిజం కాదని స్పష్టం చేశారు. సమాజానికి సరైన జర్నలిజం అంటే ఏమిటో చూపించాల్సిన బాధ్యత జర్నలిస్టు సంఘాలపై ఉందన్నారు. ఈ స‌మావేశంలో రాష్ట్ర ఉపాధ్య‌క్షులు ఫైజ‌ల్‌, సంగారెడ్డి జిల్లా అధ్య‌క్షులు బండారు యాద‌గిరి, అన్ని జిల్లాల అధ్య‌క్షులు, కార్య‌వ‌ర్గ స‌భ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు