భర్తను పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య

23-11-2026 | 06:08pm
  1. 10 రోజుల తర్వాత మిస్టరీ ఛేదించిన కంగ్టి పోలీసులు
  2. నిందితురాలు బుజ్జమ్మ అరెస్ట్  రిమాండ్‌కు తరలింపు

కంగ్టి, నవంబర్ 23 (విజయక్రాంతి): కంగ్టి మండలం దెగులవాడి గ్రామంలో(Degulawadi Village) 10 రోజుల క్రితం చోటుచేసుకున్న అనుమానాస్పద మృతి కేసును ఛేదించినట్లు సీఐ వెంకటరెడ్డి(CI Venkata Reddy) తెలిపారు. భర్తను పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో భార్య గునే బుజ్జమ్మ (36)ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. కంగ్టి సీఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. దెగులవాడి గ్రామానికి చెందిన గునే జెరప్ప (46) భార్య బుజ్జమ్మ మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి.

వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భర్త ప్రతిరోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యపై అనుమానంతో గొడవపడుతూ, వేధించేవాడని తెలిపారు.భర్త వేధింపులు భరించలేక అతడిని ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన బుజ్జమ్మ, నవంబర్ 10వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇంటి బయట మంచంపై నిద్రిస్తున్న భర్త జెరప్పపై ద్విచక్రవాహనం కోసం తెచ్చిన పెట్రోల్ పోసి అగ్గిపెట్టెతో నిప్పంటించినట్లు విచారణలో వెల్లడైందన్నారు. నిందితురాలు బుజ్జమ్మను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకటరెడ్డి తెలిపారు.ఈ కేసు దర్యాప్తులో సీఐ వెంకటరెడ్డితో పాటు ఏఎస్ఐ రవీందర్ గౌడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు