గోపరాజుపల్లిలో కాంగ్రెస్‌కు జోష్

23-11-2026 | 04:48pm
  1. గ్రామానికి కొత్త బస్సు సర్వీసు ప్రారంభం
  2. ఎమ్మెల్యే కుంభం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పోలేపల్లి రమేష్

ఆలేరు, నవంబర్ 23 (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని గోపరాజుపల్లి గ్రామంలో(Goparajupalli village) భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbham Anil Kumar Reddy) పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన బస్సు సర్వీసును ప్రారంభించి, స్వయంగా బస్సులో ప్రయాణించారు.

జేబీఎస్ (JBS) నుంచి మోత్కూర్ వరకు భువనగిరి, వలిగొండ మీదుగా గోపరాజుపల్లికి నూతనంగా ఏర్పాటు చేసిన ఈ బస్సు సర్వీసుతో గ్రామ ప్రజలకు హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు సౌకర్యం కలగనుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, రోజువారీ ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. బస్సు సర్వీసు అందుబాటులోకి రావడంతో గ్రామస్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పోలేపల్లి రమేష్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు