అర్నబ్' తుపాను: జిల్లా యంత్రాంగం అప్రమత్తం
- ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
- అధికారులకు కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశం
- కలెక్టరేట్‌లో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు
వరంగల్, అక్టోబర్ 27 (విజయ క్రాంతి ): అర్నబ్' తుపాను(Arnab Cyclone) ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద(District Collector Dr. Satya Sharada) ఆదేశించారు. భారత వాతావరణ శాఖ నివేదికల ఆధారంగా వరంగల్ జిల్లాకు 'ఆరెంజ్ అలర్ట్' జారీ అయిన నేపథ్యంలో మంగళవారం ఆమె జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
తుపాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. జిల్లాలో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తహసీల్దార్లు తమ పరిధిలోని వివిధ శాఖల అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు.జిల్లాలోని వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, ప్రమాదకర లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాల వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితులు తలెత్తితే తక్షణమే స్పందించేలా సహాయక, పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచాలన్నారు.
విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లా అగ్నిమాపక శాఖ, మామునూరులోని 4వ బెటాలియన్ ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు తమ సిబ్బందితో పాటు అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అత్యవసర సేవలకు వినియోగించే వాహనాలు, వనరులు సిద్ధంగా ఉండాలని, సమాచార మార్పిడి వేగంగా జరగాలని స్పష్టం చేశారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల ఫిర్యాదులు, అత్యవసర సాయం కోసం కలెక్టరేట్‌లో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.*టోల్ ఫ్రీనంబరు: 1800 425 3424, ఫోన్ నంబరు: 9154252936
ప్రజలు కూడా వర్షాల పట్ల అప్రమత్తంగా ఉంటూ, అధికారులు ఇచ్చే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద విజ్ఞప్తి చేశారు.