మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం...
- రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు...
- రాష్ట్రవ్యాప్తంగా 8 వేల డ్వాక్రా భవనాలు ఏర్పాటు...
- బాన్సువాడ అభివృద్ధికి ఎమ్మెల్యే పోచారం కృషి స్ఫూర్తిదాయకం: మంత్రి సీతక్క...
బాన్సువాడ, అక్టోబర్ 27 (విజయక్రాంతి): మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా ప్రోత్సహించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మాతా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క(Minister Seethakka) అన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా 8 వేల డ్వాక్రా భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల అభివృద్ధి, మహిళల ఆర్థిక స్వావలంబన, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఆమె మాట్లాడారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుని కుటుంబ ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.మహిళా సంఘాలకు రుణ సదుపాయాలు కల్పించడం ద్వారా చిన్న తరహా వ్యాపారాలు, ఉపాధి కార్యక్రమాలను ప్రోత్సహించవచ్చని మంత్రి తెలిపారు.
డ్వాక్రా భవనాల ఏర్పాటుతో మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, ఇతర సామాజిక కార్యకలాపాలకు అనువైన వేదికలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న కృషి, పట్టుదల స్ఫూర్తిదాయకమని మంత్రి సీతక్క ప్రశంసించారు. మహిళా సంక్షేమం, గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని ఆమె వెల్లడించారు.మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం సమృద్ధి సాధించినప్పుడే కుటుంబాలు, గ్రామాలు, సమాజం అభివృద్ధి చెందుతాయని మంత్రి పేర్కొన్నారు.
మహిళా సాధికారత దిశగా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రగతి సాధించాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని ప్రజలు తన కుటుంబమని ఎలాంటి సమస్యలున్న పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, పార్లమెంటు సభ్యుడు సురేష్ షెట్కర్, మాజీ ఆగ్రో పరిశ్రమల చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ, వైస్ చైర్మన్ రేష్మ ఎజాజ్, వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.