పాలిటెక్నిక్ హాస్టల్‌లో విద్యార్థినుల అస్వస్థత

08-10-2026 | 06:26pm

చికెన్ తిన్న తర్వాత అనారోగ్యం.. పీహెచ్‌సీలో చికిత్స.

పెబ్బేరు: వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ శివారులోని మహిళా పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్‌లో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. బుధవారం రాత్రి హాస్టల్‌లో చికెన్ తిన్న అనంతరం సుమారు 40 నుంచి 50 మంది విద్యార్థినులు అనారోగ్యానికి గురైనట్లు సమాచారం.అస్వస్థతకు గురైన విద్యార్థినులను హాస్టల్ సిబ్బంది పెబ్బేరు పీహెచ్‌సీకి తరలించి వైద్య పరీక్షలు చేయించినట్లు తెలుస్తోంది.

అయితే ఫుడ్ పాయిజన్ కారణంగా కాకుండా వైరల్ ఫీవర్‌తోనే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని హాస్టల్ నిర్వాహకులు చెబుతున్నట్లు సమాచారం. హాస్టల్‌లో హెల్త్ క్యాంప్ నిర్వహించి 22 మంది విద్యార్థినులకు వైరల్ ఫీవర్ ఉన్నట్లు గుర్తించామని వార్డెన్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.అయితే హెల్త్ క్యాంప్ నిర్వహించిన విషయం తనకు తెలియదని కళాశాల ప్రిన్సిపల్ చెప్పినట్లు సమాచారం.

దీంతో విద్యార్థినుల అస్వస్థతకు కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని పలువురు కోరుతున్నారు.

విద్యార్థినులను పరామర్శించిన మున్సిపల్ చైర్మన్: 

విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ దయాకర్ రెడ్డి తదితరులు కళాశాలను సందర్శించి విద్యార్థినులను పరామర్శించారు.ఈ సందర్భంగా ఓ విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురై కాళ్లు, చేతులు పనిచేయడం లేదని బాధపడుతుండగా, అక్కడే ఉన్న టీవీ5 రిపోర్టర్ విజయ్ స్పందించి ఆమెను కిందికి తీసుకొచ్చారు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్ చైర్మన్ కారులో ఆమెను పెబ్బేరు పీహెచ్‌సీకి తరలించారు.

అనంతరం 108 అంబులెన్స్ ద్వారా పలువురు విద్యార్థినులను పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు.విద్యార్థినుల అస్వస్థతకు అసలు కారణం వైద్య పరీక్షలు, అధికారుల విచారణ అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఘటనపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు