మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్

08-10-2026 | 08:26pm

సీపీ అంబర్ కిశోర్ ఝా

మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్ మరింత అప్రమత్తంగా పనిచేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా(CP Amber Kishore Jha) సూచించారు. గురువారం కమిషనరేట్ కార్యాలయంలో(Commissionerate Office) షీ టీమ్స్, మహిళలు, పిల్లల రక్షణ, భరోసా కేంద్రాల సేవలపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మహిళలు, బాలికలకు భద్రతపై భరోసా కల్పిస్తూ పోలీసులపై నమ్మకం పెంచేలా షీ టీమ్స్ పనిచేయాలన్నారు. మహిళలను వేధించే ఆకతాయిలపై నిఘా పెట్టి, ఫిర్యాదులపై ఆధారాలు సేకరించి కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 12 నుంచి 18 ఏళ్ల బాలికలకు వేధింపులు, సైబర్ నేరాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, మంచి స్పర్శ–చెడు స్పర్శపై పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

బాధిత మహిళలు, చిన్నారులకు తక్షణ సహాయంతోపాటు కౌన్సెలింగ్, వైద్య, న్యాయ, పునరావాస సేవలు అందేలా శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఫిర్యాదులో నేరం ఉన్నట్లు తేలితే ముందుగా కేసు నమోదు చేసి అనంతరం దర్యాప్తు చేపట్టాలని స్పష్టం చేశారు. బాధితుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షీ టీమ్స్ సిబ్బంది బాధితుల గోప్యతను కాపాడుతూ నిజాయితీ, పారదర్శకతతో విధులు నిర్వహించాలని సూచించారు.

ఈ సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, సీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ అనిల్, మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, షీ టీమ్ ఎస్‌ఐలు హైమా, ఉషారాణి, లావణ్య, సిబ్బంది, భరోసా కేంద్రం సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు