విద్యార్థులకు నిర్దేశిత మెనూ తప్పనిసరిగా అమలు చేయాలి

28-11-2026 | 02:50pm

తుంగతుర్తి (విజయక్రాంతి): గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు నిర్దేశించిన మెనూ (Menu) తప్పనిసరిగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ సభ్యురాలు సరిత ఆదేశించారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు (Action) తప్పవని హెచ్చరించారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాల, బాలుర గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ (Inspection) చేసి విద్యార్థులకు తయారు చేసిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ చిన్నారుల నుంచి గురుకుల విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరికీ నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. అంగన్వాడీ టీచర్లు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు వారానికి సంబంధించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి గాయపడిన ఘటన తన దృష్టికి వచ్చిందన్నారు. బాధిత విద్యార్థితో పాటు అతడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. విద్యార్థుల భద్రత (Safety) విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. వారి బంగారు భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

గురుకులంలో కాలం చెల్లిన విద్యుత్ సర్వీస్ వైర్‌ను వెంటనే మార్చి, కొత్త వైర్‌ను ఎత్తులో ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్ సతీష్‌ను ఆదేశించారు. వెంటనే కొత్త వైర్ తెప్పించి మార్పు చేయిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కాస్మోటిక్ చార్జీలు పెంచడం ప్రజాపాలన ప్రభుత్వ ఘనతగా ఆమె పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి సమయపాలన పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వహించినప్పుడే గుర్తింపు లభిస్తుందని సూచించారు.

మరిన్ని వార్తలు