అండాల సేకరణలో ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్ (విజయక్రాంతి): హైదరాబాద్‌లో అండాల దానం పేరుతో సాగుతున్న అక్రమ కార్యకలాపాల వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై పోలీసుల దర్యాప్తు (Investigation) ముమ్మరమైంది. గర్ల్స్ హాస్టళ్లను అడ్డాగా చేసుకుని వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులు, మహిళలను నగరానికి రప్పిస్తూ వారి నుంచి అండాలు సేకరించి అక్రమ వ్యాపారం సాగిస్తున్న ముఠా వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ కేసులో కీలక నిందితుడు ఎమిరిశెట్టి దుర్గాప్రసాద్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణలో పలు కీలక విషయాలను రాబట్టారు.నిందితుడు వెల్లడించిన వివరాల ఆధారంగా అండాల సేకరణ వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థలు, ఆర్థిక లావాదేవీలు, ఏఆర్టీ బ్యాంకులు, ఫెర్టిలిటీ కేంద్రాల మధ్య సంబంధాలపై దృష్టి సారించారు.
దర్యాప్తులో భాగంగా శుక్రవారం మల్కాజిగిరి పోలీసులు బేగంపేటలోని ఒయాసిస్ ఆసుపత్రి కార్పొరేట్ కార్యాలయంతో పాటు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ రోడ్డులోని మరో కార్యాలయంలో విస్తృతంగా సోదాలు (Search Operations) నిర్వహించారు. అండాల సేకరణ ప్రక్రియ, ఫెర్టిలిటీ కేంద్రాలతో సంబంధాలకు సంబంధించిన ఆధారాల కోసం పలు విభాగాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ల్యాప్‌టాప్‌లు, డిజిటల్ పరికరాలు, పత్రాలు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ఏఆర్టీ బ్యాంకుల కార్యకలాపాలు, ఫెర్టిలిటీ సేవలు, అండాల దాతల వివరాలు, రిజిస్ట్రేషన్, స్క్రీనింగ్ ప్రక్రియలకు సంబంధించిన పత్రాలను పోలీసులు పరిశీలించారు. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అండాల సేకరణలో భాగస్వాములైన సంస్థలు, వాటితో సంబంధం ఉన్న వ్యక్తుల పాత్రపై ఆరా తీస్తున్నారు.
స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలు, రికార్డులను ఫోరెన్సిక్ పరీక్షలకు (Forensic Analysis) పంపించారు. వాటి విశ్లేషణ అనంతరం ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు, సంస్థల మధ్య సంబంధాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఒయాసిస్ నిర్వాహకులు, ఫెర్టిలిటీ కేంద్రాలు, మధ్యవర్తులు, బాధిత మహిళల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
దాతల రిజిస్ట్రేషన్, రిఫరల్ వివరాలు, వైద్య పరీక్షలు, స్క్రీనింగ్ నివేదికలు, చెల్లింపులకు సంబంధించిన రికార్డులను సేకరించి విశ్లేషిస్తున్నారు. మహిళల నుంచి అండాల సేకరణ ప్రక్రియ చట్టబద్ధంగా జరిగిందా? దాతలకు నిబంధనల ప్రకారం చెల్లింపులు చేశారా? వైద్య, ఆర్థిక లావాదేవీలు అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ART) చట్టం–2021కు అనుగుణంగా ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.ఈ సోదాలు, విచారణల ద్వారా అండాల సేకరణ వ్యవహారం వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను వెలికితీసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.