మహిళల స్వయం ఉపాధికి నవ లిమిటెడ్ ప్రోత్సాహం
పాల్వంచ (విజయక్రాంతి): నవ లిమిటెడ్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (Corporate Social Responsibility) కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నవ మహిళా సాధికార కేంద్రంలో శనివారం యోగ్యత పత్రాలు, ప్రోత్సాహక చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆయన చేతుల మీదుగా తాటి ఆకులతో తయారు చేసిన కళాకృతులు, జ్యూట్ బ్యాగుల తయారీ, విక్రయాల ద్వారా వచ్చిన రూ.2,27,610 నగదుకు సంబంధించిన చెక్కును మహిళా కళాకారులకు అందజేశారు. కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆఫీస్ ఆటోమేషన్ (Office Automation)లో యోగ్యత పత్రాలను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా జీయర్ స్వామి మాట్లాడుతూ మహిళల్లోని నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారిని స్వయం ఉపాధి దిశగా నడిపించేందుకు నవ యాజమాన్యం చేస్తున్న కృషిని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నవ లిమిటెడ్ ప్రమోటర్ రమా దేవినేని, సీఎస్ఆర్ హెడ్ డి. సుధాకర్, శ్రీనివాసరావు, అముద, టి. అరుణ, బి. అరుణ, శిరీష, దివ్య, కవిత, రమేష్, రాజకుమారి తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.