సమగ్ర వ్యవసాయంతోనే రైతులకు అధిక ఆదాయం

28-11-2026 | 02:52pm

హుజురాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): సమగ్ర వ్యవసాయ (Integrated Farming) విధానాలతో రైతులు అధిక ఆదాయం పొందవచ్చని కేవీకే జమ్మికుంట శాస్త్రవేత్త ప్రభాకర్ సూచించారు. వెంకట్రావుపల్లి గ్రామంలో సర్పంచ్ పత్తి అనిత అధ్యక్షతన శనివారం ఖేత్ బచావో అభియాన్ (Khet Bachao Abhiyan) రైతు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ పంటల సాగుతో పాటు పాడి పరిశ్రమను చేపట్టి అదనపు ఆదాయం (Additional Income) పొందాలని సూచించారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. పంట అవశేషాలను కాల్చకుండా సుస్థిర వ్యవసాయ (Sustainable Agriculture) పద్ధతులను అనుసరించాలని వివరించారు.

వ్యవసాయ అధికారి భూమిరెడ్డి మాట్లాడుతూ వరి సాగుకు ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యాన పంటలను సాగు చేయాలని సూచించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను వినియోగించాలని తెలిపారు. ఉద్యానవన అధికారి మధులిక ఆయిల్‌పామ్ సాగు విధానం, దాని ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి పొద్దుటూరి సతీష్, గ్రామ పాలన అధికారి రాజు, ఆయిల్‌పామ్ ఫీల్డ్ అధికారి లక్ష్మణ్‌రావు, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్, గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు