పాండవ వనవాస ఘట్టాన్ని చాటిన ముదిరాజులు
గంపలతో మహిళల ఊరేగింపు.. పాండవుల ఆలయం వద్ద ప్రత్యేక పూజలు
గరిడేపల్లి,(విజయక్రాంతి): మహాభారతంలోని పాండవుల వనవాస ఘట్టాన్ని స్మరించుకుంటూ గరిడేపల్లి మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్తులు శనివారం సంప్రదాయబద్ధంగా వనవాస కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసిన మహిళలు గంపలతో గ్రామంలో ఊరేగింపుగా వెళ్లారు.
పాండవుల వేషధారణతో వనవాస ఘట్టాన్ని ప్రదర్శిస్తూ పూర్వీకుల ఆచార సంప్రదాయాలను చాటుకున్నారు.ముదిరాజుల జానపద సంప్రదాయాల్లో భాగంగా పాండవులను ఆరాధిస్తూ ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం చేసిన ఘట్టాన్ని గుర్తుచేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
పాండవుల ధర్మనిష్ఠ, కష్టసహనాన్ని స్మరించుకుంటూ గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని గ్రామ దేవతలను ప్రార్థించారు. అనంతరం మేళతాళాల నడుమ గ్రామ శివారులోని పాండవుల దేవాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ సంప్రదాయబద్ధంగా వంటలు తయారు చేసి పెద్దమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తరతరాలుగా వస్తున్న జానపద కళలు, వీరగాథలు, పూర్వీకుల సంప్రదాయాలను భావితరాలకు అందించడంతోపాటు కులస్తుల ఐక్యతను చాటారు. ఈ కార్యక్రమంలో కుల పెద్ద చామకూరి నాగేశ్వరరావు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ చామకూరి దశరథ్, మాజీ చైర్మన్ ప్రధాని సైదులు, జుట్టబోయిన పకీరయ్య, డైరెక్టర్లు, ముదిరాజ్ కులస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.