గిరిజన రైతుల అభివృద్ధే లక్ష్యం
కూరగాయలు, మిరప సాగుపై ప్రత్యేక శిక్షణ.. 20 మంది రైతులకు ఉచితంగా నారు మొక్కల పంపిణీ
గరిడేపల్లి, అక్టోబర్ 28 (విజయ క్రాంతి): గిరిజన రైతుల అభివృద్ధి, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)(Krishi Vigyan Kendra, Gaddipalli) పనిచేస్తోందని ఉద్యాన శాస్త్రవేత్త సీహెచ్ నరేష్(Horticulturist Ch. Naresh) తెలిపారు. కేవీకే ఆధ్వర్యంలో బుధవారం గిరిజన రైతులకు యాసంగి కూరగాయలు, మిరప సాగుపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆత్మకూరు ఎస్ మండలం బొట్య తండాకు చెందిన 20 మంది గిరిజన రైతులకు టమాట, వంకాయ, పచ్చిమిరప, ఎర్రమిరప నారు మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు.హైదరాబాద్‌లోని ఐసీఏఆర్–ఏటీఏఆర్‌ఐ జోన్-10 సహకారంతో గిరిజన ఉప ప్రణాళిక కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ..
వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి నీటి కొరత ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపారు. రైతులు బిందు సేద్యం, మల్చింగ్ వంటి పద్ధతులను అనుసరించి నీటిని ఆదా చేసుకోవాలని సూచించారు. సమతుల్య ఎరువుల వినియోగం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు.
రైతులు భూమి స్వభావం, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుని సాగు ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. ఒక్కో రైతుకు అర ఎకరం చొప్పున సాగు చేసుకునేందుకు నారు మొక్కలు అందించడంతో మొత్తం 10 ఎకరాల్లో కూరగాయలు, మిరప సాగుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.
శాస్త్రీయ సాగు పద్ధతులను పాటించి అధిక దిగుబడులు సాధించాలని, కేవీకే అందిస్తున్న శిక్షణ, సాంకేతిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో కేవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త ఈ. ఆదర్శ్, గృహ విజ్ఞాన విభాగం సహాయకురాలు ఎన్. సుగంధి, కేవీకే సిబ్బంది పాల్గొన్నారు.