విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

28-10-2026 | 10:39pm

ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎంలకు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదేశం

ఇల్లెందు, అక్టోబరు 28 (విజయక్రాంతి): వాతావరణ మార్పుల నేపథ్యంలో విద్యార్థులకు వైరల్‌ జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్(ITDA PO B Rahul) సూచించారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణతోపాటు మెనూ ప్రకారం సమయానికి పౌష్టికాహారం అందించాలని, చదువుతోపాటు పోటీ పరీక్షలకు అవసరమైన అంశాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

బుధవారం ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, వంటగది, స్టోర్‌ రూమ్‌, వసతి గదులు, భోజనశాలను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

వంట సిబ్బంది పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులకు భోజనం వడ్డించే ముందు ఉపాధ్యాయులు, సిబ్బంది ఆహారాన్ని రుచి చూసిన తర్వాతే అందించాలని సూచించారు. విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు బుక్‌ అంశాలను అధ్యయనం చేసి పోటీ పరీక్షలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలన్నారు.

ఉపాధ్యాయుల అనుమతి లేకుండా బయటకు వెళ్లరాదని, ఖాళీ సమయాల్లో కెరీర్‌ గైడెన్స్‌ చార్టులను పరిశీలించి భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించు కోవాలని సూచించారు. పీఈటీలు విద్యార్థులకు ఆసక్తి ఉన్న క్రీడల్లో శిక్షణ ఇచ్చి ఈ నెలలో జరిగే పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు