‘ఆపరేషన్ ట్రైడెంట్’తో డ్రగ్స్ మాఫియాకు చెక్: అమిత్ షా
న్యూఢిల్లీ: భారత దేశపు యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్స్ మాఫియా మూలాలను దెబ్బతీసే లక్ష్యంతో ‘ఆపరేషన్ ట్రైడెంట్(Operation Trident)’ పేరుతో భారీ స్థాయిలో దాడులు చేపట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), ఇతర కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల సమన్వయంతో అక్టోబర్ 23న అస్సాం, మిజోరం, మణిపూర్ రాష్ట్రాల్లోని 38 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించాయి.
ఈ దాడుల్లో 18 మందిని అరెస్టు చేయగా, 500 డిటోనేటర్లు, రూ.12 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా వెనుక ఉన్న ఆర్థిక నెట్‌వర్క్‌లపై దృష్టి సారించిన అధికారులు సుమారు రూ.100 కోట్ల హవాలా లావాదేవీలను గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించి 1,424 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంతోపాటు, రూ.17.82 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు వెల్లడించారు.
మయన్మార్ సరిహద్దు మార్గాల ద్వారా సాగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా భద్రతా, దర్యాప్తు సంస్థలు ప్రత్యేక చర్యలు చేపట్టాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు . ప్రభుత్వ బృందాలు ఐజ్వాల్, చంఫాయ్, జోఖావ్తార్, చురాచాంద్‌పూర్, కచార్ వంటి కీలక ప్రాంతాల్లో దాడులు నిర్వహించాయి. మయన్మార్‌లోని సాగైంగ్ ప్రాంతంతో సంబంధం ఉన్నట్లు గుర్తించిన అక్రమ రవాణా మార్గాలను కూడా లక్ష్యంగా చేసుకున్నాయి. డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులకే పరిమితం కాకుండా, వాటి వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు, హవాలా వ్యవస్థలు, నెట్‌వర్క్‌లను ఛేదించడంపై ఈ ఆపరేషన్‌లో ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేస్తోంది. 2029 డిసెంబర్ 31 నాటికి మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌లను సమూలంగా నిర్మూలించాలన్న లక్ష్యంలో ‘ఆపరేషన్ ట్రైడెంట్’ అత్యంత కీలక పాత్ర పోషించనుంది. యువతను మాదకద్రవ్యాల బారినుంచి కాపాడటం, అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, దేశ సరిహద్దుల భద్రతను మరింత బలోపేతం చేయడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.