హైదరాబాద్లో మబ్బులు
హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రానున్న 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో Moderate to Heavy Rainfall కురిసే అవకాశం ఉండగా, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే సూచనలున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా.
సాయంత్రం వేళ వర్షాలు ఉత్తర తెలంగాణలోని మరికొన్ని జిల్లాల వైపు విస్తరించే అవకాశం ఉంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయి. నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ, హనుమకొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో Light to Moderate Rainfall నమోదయ్యే అవకాశం ఉంది. బలమైన గాలులు వీచే ప్రాంతాల్లో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక హైదరాబాద్లో రానున్న 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లోనూ స్వల్ప వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి. వర్షాల సమయంలో ప్రయాణాలు చేసేవారు Weather Updatesను గమనిస్తూ జాగ్రత్తగా వెళ్లాలి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వాతావరణ శాఖ జారీ చేసే తాజా సూచనలను అనుసరించడం అవసరం.