సాగుభూముల సంరక్షణపై రైతులకు అవగాహన

24-10-2026 | 05:05pm

సేంద్రియ సాగుతో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

చివ్వెంల, అక్టోబర్ 24 (విజయక్రాంతి): సాగుభూముల సంరక్షణ, భూగర్భ జలాల పరిరక్షణపై(Conservation of Groundwater) రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని కేవీకే గడ్డిపల్లి ప్రధాన శాస్త్రవేత్త డా. డి. నరేష్ సూచించారు. శనివారం చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్ క్లస్టర్ రైతు వేదికలో వ్యవసాయ శాఖ(Department of Agriculture) ఆధ్వర్యంలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించాలని, పశువుల ఎరువు(Animal manure), కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులతో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. పంట మార్పిడి(Crop rotation), వర్షపు నీటి సంరక్షణతో పాటు పురుగు మందులు, రసాయనిక ఎరువుల(Chemical fertilizers) వాడకాన్ని తగ్గించాలని తెలిపారు. అధిక దిగుబడులతోపాటు పంట నాణ్యత, సాగు ఖర్చుల తగ్గింపు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి డి. వెంకటేశ్వర్లు, వ్యవసాయ విస్తరణ అధికారి కె. శ్రీశైలం, సర్పంచ్ గోగుల ఈదయ్య, పంచాయతీ కార్యదర్శి రమేష్, రైతులు శ్రీను, వెంకన్న, నరేష్, చాంప్ల, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు