బీమా వ్యాపారంలో ఐసీఐసీఐ లైఫ్ జోరు

24-10-2026 | 05:51pm

ముంబై: ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్(ICICI Life Insurance Limited) 2027 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో కీలక వ్యాపార విభాగాల్లో వృద్ధిని నమోదు చేసింది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, పన్నుల అనంతర లాభం (పీఏటీ) వార్షిక ప్రాతిపదికన 26.5 శాతం పెరిగి రూ.760 కోట్లకు చేరింది.

న్యూ బిజినెస్ ప్రీమియంలో 25% వృద్ధి

2027 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో న్యూ బిజినెస్ ప్రీమియం(New Business Premium) గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 25 శాతం పెరిగి రూ.11,821 కోట్లకు చేరింది. న్యూ బిజినెస్ విలువ (వీఎన్‌బీ) 22.3 శాతం వృద్ధితో రూ.1,283 కోట్లకు పెరిగింది. వీఎన్‌బీ మార్జిన్ 26 శాతంగా నమోదైంది. రిటైల్ ప్రొటెక్షన్ విభాగంలో 47.2 శాతం, యాన్యుటీ వ్యాపారంలో 50 శాతం వృద్ధి నమోదైంది. దీంతో రిటైల్ సమ్ అష్యూర్డ్ వార్షిక ప్రాతిపదికన 34.9 శాతం పెరిగి రూ.2.32 లక్షల కోట్లకు చేరుకుంది.

క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 99.3%

కస్టమర్ సేవలకు ప్రాధాన్యమిస్తూ క్లెయిమ్‌ల పరిష్కారంపై కంపెనీ దృష్టి సారించింది. 2027 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 99.3 శాతంగా నమోదైంది. విచారణ అవసరం లేని క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు సగటున 1.1 రోజులు పట్టింది. సమీక్షా కాలంలో రూ.2,627 కోట్ల డెత్ క్లెయిమ్‌లను చెల్లించగా, మెచ్యూరిటీ, సర్వైవల్ బెనిఫిట్స్ కింద రూ.8,634 కోట్లను వినియోగదారులకు అందించింది.

ఖర్చుల నియంత్రణపై దృష్టి

సేవింగ్స్ పాలసీల జారీలోనూ కంపెనీ పురోగతి సాధించింది. ప్రథమార్ధంలో జారీ చేసిన సేవింగ్స్ పాలసీల్లో 54 శాతాన్ని అదే రోజున జారీ చేసినట్లు వెల్లడించింది. జీఎస్‌టీ(GST) మినహాయించి కాస్ట్-టు-ప్రీమియం నిష్పత్తి వార్షికంగా 30 బేసిస్ పాయింట్లు తగ్గి 18.3 శాతానికి చేరింది. సేవింగ్స్ కాస్ట్-టు-ప్రీమియం నిష్పత్తి 90 బేసిస్ పాయింట్లు తగ్గి 11.6 శాతంగా నమోదైంది.

కస్టమర్ అవసరాలే ప్రధాన లక్ష్యం

కస్టమర్ కేంద్రిత విధానాలు, విభిన్న పంపిణీ వ్యవస్థ, వినియోగదారుల అవసరాలకు అనుగుణమైన బీమా ఉత్పత్తులు సంస్థ వృద్ధికి కీలకమని ఐసీఐసీఐ లైఫ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సిద్ధార్థ మిశ్రా తెలిపారు. భారత్‌లో బీమా విస్తరణకు ఇంకా అవకాశాలు ఉన్నాయని, ప్రొటెక్షన్, యాన్యుటీ విభాగాలు సంస్థ దీర్ఘకాలిక వ్యూహంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. వ్యాపార వృద్ధి, లాభదాయకత, రిస్క్ మధ్య సమతౌల్యత పాటిస్తూ న్యూ బిజినెస్ విలువను నిలకడగా పెంచేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన వివరించారు.

25 ఏళ్ల ప్రస్థానంలో మరో మైలురాయి

20 కోట్లకు పైగా భారతీయుల కలలు, ఆర్థిక భవిష్యత్తుకు భద్రత కల్పించే లక్ష్యంతో సాగుతున్న 25 ఏళ్ల ప్రయాణంలో కంపెనీ పేరు ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్‌గా మారడం మరో కీలక మైలురాయిగా సంస్థ పేర్కొంది. ‘హర్ కల్ ఆసాన్’ నినాదానికి అనుగుణంగా కస్టమర్ ఫస్ట్ విధానంతో ముందుకు సాగనున్నట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు