నివేదికలు లేని మండల సభ
- పలువురు అధికారుల గైర్హాజరు
- గజ్వేల్ మండల సర్వసభ్య సమావేశం
గజ్వేల్ అక్టోబర్ 24: మండల పరిధిలోని ఆయా శాఖల పూర్తిస్థాయి నివేదికలు లేకుండానే గజ్వేల్ మండల(Gajwel Mandal) సర్వసభ్య సమావేశం జరిగింది. శనివారం నిర్వహించిన గజ్వేల్ మండల సర్వసభ్య సమావేశంకు ఒకరోజు ముందే ఆయా శాఖల అధికారులు నివేదికలు సమర్పించాలని ఎంపీడీవో మహేష్(MPDO Mahesh) ముందస్తు సమాచారం ఇచ్చినా కూడా పలు శాఖల అధికారులు తమ నివేదికలను(Reports) సమర్పించకపోవడం గమనార్హం. 22 శాఖలకు గాను ఎనిమిది శాఖల అధికారులు మండల సర్వే సమావేశానికి నివేదికలు అందజేయలేదు.
ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి మండల సర్వసభ్య సమావేశం(Mandal General Body Meeting) సర్పంచులకు చక్కని వేదిక. కానీ నూతనంగా ఎంపికైన సర్పంచులు 12 మంది మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఎంపీటీసీలు లేని క్రమంలో ఆయా గ్రామాల సమస్యలు మండల సభకు సర్పంచ్లు నివేదించాల్సి ఉంది. ఇటు పూర్తిస్థాయిలో సర్పంచ్లు, అటు అధికారులు రాకపోవడంతో సభ నామమాత్రంగా కొనసాగింది.
మండల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లా హార్టికల్చర్ అధికారి సువర్ణ గైర్హాజరైన అధికారుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాలి మరి. కాగా సమావేశంలో పలువురు సర్పంచులు తాగునీటి సమస్యతోపాటు విద్యుత్, అంగన్వాడి సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో ఎంపీడీవో మహేష్, తహసిల్దార్ శ్రీనివాస్, హౌసింగ్ డిఇ కవిత, ఆయా శాఖల అధికారులు సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.