డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల డ్రా లో టెన్షన్.... టెన్షన్.

29-09-2026 | 02:33pm
  1. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల డ్రాలో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన
  2. పలువురిని అరెస్టు చేసిన పోలీసులు

తుంగతుర్తి (విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా మద్దిరాల గ్రామంలో(Maddirala Village) డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు కోసం నిర్వహించిన డ్రా ప్రక్రియ, ఉద్రిక్తతకు దారితీసింది. మొత్తం 58 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను డ్రా పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయించేందుకు అధికారులు మంగళవారం చర్యలు చేపట్టగా, కేటాయింపుల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు గ్రామస్థులు నిరసనకు దిగారు.

అర్హులైన నిరుపేదలకుకాకుండాఅనర్హులకుఇళ్లుకేటాయిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. ఇప్పటికే ఇళ్లు ఉన్న కొందరికి కూడా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, కేటాయిస్తున్నారని, ఏళ్లుగా సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న అర్హులైన పేద కుటుంబాలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

డ్రా ప్రక్రియపై, అభ్యంతరం వ్యక్తం చేస్తూ, గ్రామస్థులు నిరసన, ధర్నా చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో గ్రామస్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి చెదరగొట్టి, కొందరిని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపి, లబ్ధిదారుల అర్హతలనుపునఃపరిశీలించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. నిజమైన నిరుపేదలను గుర్తించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా ఇళ్లను కేటాయించాలని వారు అన్నారు.కాగా, కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల అధికారిక స్పందన తెలియాల్సి ఉంది. జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయిలో విచారణ జరిపి, అర్హులైన నిరుపేదలకు  డబుల్ బెడ్ రూములు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు