విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం సరికాదు
బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వెంకటేశం
కోహెడ,(విజయక్రాంతి): విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటం కాంగ్రెస్ ప్రభుత్వానికి(Congress government) సరికాదని.. బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ(BJP), బీజేవైఎం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టేందుకు సిద్ధమైతే కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు నిరాకరించడం సిగ్గుచేటన్నారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనను తెలియజేసేందుకు చలో అసెంబ్లీ(Chalo Assembly)కి పిలుపునివ్వగానే తెల్లవారుజాము నుంచే బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేయించడం చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగా భయపడిపోతుందో అర్థమవుతోందన్నారు. విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. విద్యార్థుల పక్షాన ప్రశ్నించే బీజేపీ నాయకులను అరెస్టు చేయడం సరికాదన్నారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రతిపక్షాల గొంతును అణిచివేసిందో.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అవలంబిస్తోందని ఘాటుగా విమర్శించారు.
