పాఠశాల చైర్మన్ నియామకంపై ప్రజావాణిలో ఫిర్యాదు
మహమ్మదాబాద్,(విజయక్రాంతి): మండల పరిధిలోని నంచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Zilla Parishad High School) చైర్మన్ నియామకంపై నంచర్ల గ్రామానికి చెందిన ఎం. సరోజ సోమవారం మహమ్మదాబాద్ మండల ప్రజావాణి(Prajavani )లో ఫిర్యాదు చేశారు. ఎంపీడీవో నరేందర్‌రెడ్డి, తహసీల్దార్ విద్యాసాగర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారుల సమక్షంలో ఆమె ఫిర్యాదును అందజేశారు. తనను నంచర్ల గ్రామ సంఘాల అధ్యక్షురాలిగా నియమించిన నేపథ్యంలో పాఠశాల చైర్మన్‌గా కూడా కొనసాగించాల్సి ఉందని సరోజ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పాఠశాల ప్రధానోపాధ్యాయులు తనను చైర్మన్‌గా కొనసాగించకుండా మరో వ్యక్తిని కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
ప్రస్తుత చైర్మన్ గ్రామ సంఘాల అధ్యక్షురాలు కాదని, ఆమె పిల్లలు కూడా అదే పాఠశాలలో చదవడం లేదని తెలిపారు. ఈ విషయంపై ప్రధానోపాధ్యాయులను పలుమార్లు కలిసి వివరణ కోరినా స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని సరోజ పేర్కొన్నారు. చైర్మన్ నియామకం ఏ నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం జరిగిందో సమగ్రంగా విచారించాలని అధికారులను కోరారు. నియామకంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే తగిన చర్యలు తీసుకొని అర్హత ఉన్న వారికి న్యాయం చేయాలని ప్రజావాణి అధికారులకు విజ్ఞప్తి చేశారు.
