అవినీతి రాజకీయాలకు కేరాఫ్ మాజీ ఎమ్మెల్యే బొల్లం
కాంగ్రెస్ నేత రావెళ్ల కృష్ణారావు ఘాటు విమర్శలు
కోదాడ,(విజయక్రాంతి): 100 పడకల ప్రభుత్వాసుపత్రి విషయంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్(Former MLA Bollam Mallaiah Yadav) చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ ఉనికిని చాటుకునే ప్రయత్నమేనని కాంగ్రెస్ నాయకుడు రావెళ్ల కృష్ణారావు(Congress leader Ravella Krishna Rao) విమర్శించారు. గురువారం ఆయన మాట్లాడుతూ జీవోను చూపిస్తూ మొత్తం ఘనతను తన ఖాతాలో వేసుకోవడం సరికాదని, జీవో జారీ చేయడంతోనే ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి వచ్చినట్లు కాదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అనుభవించిన మల్లయ్య యాదవ్.. తన హయాంలో ఆసుపత్రి పనులను ఎందుకు పూర్తి చేయలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పాలనలో కోదాడ నియోజకవర్గంలో ఏం జరిగింది, ఏ పనులు పూర్తయ్యాయి, ఏవి అసంపూర్తిగా మిగిలాయి అన్నది ప్రజలకు స్పష్టంగా తెలుసని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులపై ప్రజలకు సమాధానం చెప్పకుండా ఇప్పుడు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై విమర్శలు చేయడం వల్ల వాస్తవాలు మారవని అన్నారు. ప్రభుత్వాసుపత్రి, డయాలసిస్ కేంద్రం వంటి ప్రజా ఆరోగ్య అంశాలను రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం తగదని, ప్రజల ప్రాణాలు, ఆరోగ్యానికి సంబంధించిన సేవల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఆరోపణలు చేసినంత మాత్రాన వాస్తవాలు కనుమరుగుకావు” అని రావెళ్ల కృష్ణారావు స్పష్టం చేశారు.