రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
కేటీఆర్ సమక్షంలో భారీగా పార్టీలో చేరికలు
ఆర్మూర్,(విజయక్రాంతి): తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్(BRS) ప్రభుత్వమేనని కేటీఆర్ పేర్కొన్నారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సమక్షంలో తెలంగాణ భవన్ లో గురువారం ఆర్మూర్ నియోజకవర్గ(Armur Constituency) నుంచి కాంగ్రెస్, బిజెపి నుంచి భారీగా బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... పొద్దున లేస్తే కేసీఆర్ ఫ్యామిలీని వ్యక్తిత్వ హననం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతిమాలిన రాజకీయానికి ప్రజలే ఖననం చేస్తారని హెచ్చరించారు.
కాంగ్రెస్, టీడీపీ ల హయంలోనే సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో సంక్షేమం లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వెలుగులు విరజిమ్మితే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మళ్లీ సంక్షోభంలోకి చేనేతలు నెట్టివేయబడ్డారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల సంక్షేమ పథకాలను నిలిపివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకం వల్లే ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికులు మళ్ళీ బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా చూడాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆర్మూర్ లో వివిధ పార్టీల నుంచి నేతలు బీఆర్ఎస్ చేరడం శుభ పరిణామమ న్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎప్పటికీ బీఆర్ఎస్ ఖిల్లా అని ఆయన అభివర్ణించారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడం ఎవడబ్బతరం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.