ట్రామాడాల్ క్యాప్సూల్స్ అక్రమ విక్రయం.. 6,368 స్వాధీనం
రామచంద్రాపురం,(విజయక్రాంతి): రామచంద్రాపురం(Ramachandrapuram) మండలం తెల్లాపూర్‌లోని ఓ మెడికల్ దుకాణంపై టీజీ సేఫ్ డ్రగ్స్(TG Safe Drugs) విభాగం అధికారులు దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన అలవాటుగా మారే ఔషధాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తెల్లాపూర్ గ్రామంలోని శ్రీ గణేశ్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్‌పై అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రామాడాల్ కలిగిన పీవాన్ స్పాస్ ప్లస్ క్యాప్సూల్స్‌ను కొనుగోలు బిల్లులు లేకుండా నిల్వ ఉంచి, విక్రయ బిల్లులు జారీ చేయకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న 6,368 క్యాప్సూల్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.58,904గా అధికారులు తెలిపారు. ట్రామాడాల్ నొప్పి నివారణకు వినియోగించే ఓపియాయిడ్ ఔషధమని, ఇది అలవాటుగా మారే స్వభావం కలిగి ఉండటంతో షెడ్యూల్ హెచ్1 ఔషధాల కిందకు వస్తుందని పేర్కొన్నారు. వైద్యుల చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే వీటిని విక్రయించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.