నా బండారం ఇదే: కేటీఆర్
రేవంత్‌కు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్.. ఆస్తులపై విచారణకు సిద్ధమా?
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆస్తుల అంశం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. ఇరు కుటుంబాల ఆస్తులపై సుప్రీంకోర్టు(Supreme Court) న్యాయమూర్తితో విచారణ జరిపించేందుకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. విచారణలో తమ తప్పు నిరూపితమైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు.
సిరిసిల్లలో సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్(KTR).. తన ఆస్తుల వివరాలను బయటపెడతానంటూ రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లారని విమర్శించారు. కాంగ్రెస్(Congress) నేతల పర్యటనను శత్రుదేశంపై దండయాత్రకు వెళ్లినట్లుగా అభివర్ణించారు. సభలో పోలీసులే ఎక్కువగా కనిపించారని, అంత భారీగా బందోబస్తు ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. తన ఆస్తుల గురించి సీఎం మాట్లాడిన అంశాలన్నీ ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించిన వివరాలేనని కేటీఆర్ పేర్కొన్నారు.
అమెరికా సంపాదనతోనే హోటళ్ల వ్యాపారం.. కేటీఆర్ వివరణ
తన కుటుంబ ఆర్థిక నేపథ్యం, వ్యక్తిగత సంపాదనపై కూడా కేటీఆర్ స్పందించారు. తన తాతల కాలం నుంచే కుటుంబానికి భూములు ఉన్నాయని, తాను అమెరికాలో ఆరేళ్లపాటు ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బుతో 2006లో హోటల్ వ్యాపారం ప్రారంభించానని తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యాపారం మూడు హోటళ్లకు విస్తరించిందని చెప్పారు. రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే మరిన్ని హోటళ్లు ఏర్పాటు చేసేవాడినని వ్యాఖ్యానించారు. తన హోటళ్లకు సీఎం రేవంత్ రెడ్డి ఉచిత ప్రచారం కల్పించారని ఎద్దేవా చేశారు.
అమెరికా(America)లో ప్రతి ఒక్కరూ తమ పనులు తామే చేసుకుంటారని, అక్కడ బాత్‌రూమ్‌లు శుభ్రం చేయడం కూడా తప్పు కాదని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్(KCR) ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, కేంద్ర మంత్రి, డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారని గుర్తుచేశారు. తన విద్యార్హతలపై సీఎం చేసిన వ్యాఖ్యలకు కూడా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. డిగ్రీ చదువుకు సాధారణంగా మూడేళ్లు పడుతుందని, రేవంత్ రెడ్డి మాత్రం ఎనిమిదేళ్లు చదివారని విమర్శించారు. ఆస్తుల విచారణకు తాను సిద్ధమని చెబుతున్న కేటీఆర్ సవాల్‌ను సీఎం ఎలా స్వీకరిస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.