కరువు కాటుకు రైతు విలవిల.!
- రూ.వెయ్యి కోట్ల ప్రత్యేక సాయం అందించాలి
- బోర్లలో అడుగంటిన నీరు.. విద్యుత్ కోతలతో కాలుతున్న మోటార్లు
- రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం చొరవ చూపాలి
- బీఆర్ఎస్ నాయకుడు గౌని సంతోష్ కుమార్ డిమాండ్
మోతె, అక్టోబర్ 28 (విజయ క్రాంతి): కరువు పరిస్థితులు, విద్యుత్ కోతలతో సతమతమవుతున్న రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ నాయకుడు గౌని సంతోష్ కుమార్(BRS leader Gouni Santosh Kumar) డిమాండ్ చేశారు. బోర్లలో నీరు అందక, విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో మోటార్లు కాలిపోతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ఇతర రాష్ట్రాలకు నీటి విడుదల విషయంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు తక్షణ చర్యలు చేపట్టి, రైతులకు సాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని కోరారు.రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన ఆయన..
పరిస్థితులను చక్కదిద్దలేకపోతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యత వహించి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు.కరోనా సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అండగా నిలిచారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా రైతుల కష్టాలను గుర్తించి, ప్రత్యేక నిధులు కేటాయించి కరువు నుంచి ఉపశమనం కల్పించాలని గౌని సంతోష్ కుమార్ కోరారు.