మహిళపై కర్రతో దాడి.. దోపిడీకి యత్నం
నిందితుడి అరెస్ట్.. రిమాండ్కు తరలింపు
సిద్దిపేట రూరల్,(విజయక్రాంతి): ఒంటరిగా వెళ్తున్న మహిళను అడ్డగించి కర్రతో తలపై దాడి చేసి బంగారు గొలుసు దోచుకునేందుకు యత్నించిన నిందితుడిని సిద్దిపేట రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. తోగుట మండలం(Thoguta Mandal) వరదరాజుపల్లికి చెందిన పత్రి అరవింద్ (24) కూలీగా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల(Financial difficulties) నేపథ్యంలో దొంగతనాలకు పాల్పడుతున్న అతడు, సెప్టెంబర్ 29న ఇరుకోడు గ్రామ శివారులోని వైకుంఠధామం వద్ద పాఠశాల విధులు ముగించుకుని స్కూటీపై వెళ్తున్న మహిళను అడ్డుకుని కర్రతో తలపై కొట్టి గొలుసు లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి ద్విచక్రవాహనం, చెప్పులు, కర్రను వదిలి పరారయ్యాడు. కేసు దర్యాప్తులో భాగంగా గురువారం బూరుగుపల్లి శివారులోని కల్లు దుకాణం వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో సీఐ విద్యాసాగర్, ఎస్ఐ డి.నవత, ఏఎస్సై మక్సూద్, కానిస్టేబుళ్లు రాజు, నాగరాజు, మహేష్, శ్రీనివాస్, రమేష్, రాకేష్ పాల్గొన్నారు.