పంటల సాగుపై.. అధికారుల క్షేత్ర పరిశీలన

17-10-2026 | 09:20pm

కోహెడ,(విజయక్రాంతి): కోహెడ మండలంలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు పంటల సాగు(Crop Cultivation)పై క్షేత్రస్థాయి పర్యటనల నిర్వహించారు. ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారి సతీష్, విస్తరణ అధికారులు శ్రీధర్ రెడ్డి, శివ కుమార్, మైపాల్ రెడ్డి లతో వరి, పత్తి కంది పంటల ఎదుగుదల స్థితిని, చీడపీడల ఉధృతిని పరిశీలించారు.

వరి పంటలో కొన్ని ప్రాంతాల్లో బ్రౌన్ ప్లాంట్ హాపర్ (Brown planthopper) పురుగు ఉనికిని గుర్తించి, దాని నివారణకు తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులపై రైతులకు సూచనలు చేశారు. పంటలో పురుగు ఉధృతిని క్రమం తప్పకుండా గమనించాలని, అవసరమైనప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు తగిన నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పత్తి పంటలో రసం పీల్చే పురుగుల సముదాయం (Sucking Pest Complex) ఉనికిని గుర్తించి, వాటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలని రైతులకు వివరించారు.

అదేవిధంగా, వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు పంటల్లో తేమ సంరక్షణ చర్యలు చేపట్టాలని, అవసరానికి అనుగుణంగా నీటి వినియోగాన్ని నియంత్రించాలని, కలుపు మొక్కలను నివారించాలని, నేలలో తేమను కాపాడే పద్ధతులను పాటించాలన్నారు. పత్తిలో రసం పీల్చే పురుగుల ఉదృతి అధికంగా ఉన్నట్లయితే ఎసిఫేట్ 300గ్రా/ఎకరానికి లేదా ఫిప్రోనిల్ 600 ml /ఎకరానికి లేదా థయోమితాక్సీమ్ 80 గ్రా /ఎకరానికి పిచికారి చేసుకోవాలి.

వరిలో సుడిదోమ ఉదృతి అధికంగా ఉన్నట్లయితే పైమెట్రోజిన్ 120గ్రా/ఎకరానికి లేదా ట్రైఫ్లూమెజొపైరిమ్ 100మి. లి/ఎకరానికి లేదా డినోటెఫ్యూరాన్ 80 గ్రా/ఎకరానికి  పిచికారి చేసుకోవాలన్నారు. రైతులు తమ పంటల్లో చీడపీడల లక్షణాలను గమనించిన వెంటనే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి, వారి సూచనల మేరకు నివారణ చర్యలు చేపట్టాలని ఏఓ సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు రాజు, మహేందర్, మ్యాకల మహేందర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు