గుంతలమయంగా ధర్మారెడ్డిపల్లి రోడ్డు..
- రోడ్డు మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని బిజెపి ధర్నా
- స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిక
గజ్వేల్, నవంబర్ 4: గజ్వేల్– చేగుంట ప్రధాన రహదారిలో ధర్మారెడ్డిపల్లి గ్రామ(Dharmareddipalli village) సమీపంలో నిలిచిపోయిన రోడ్డు మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. గజ్వేల్ మండల బీజేపీ అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్ నేతృత్వంలో చేపట్టిన ఈ ఆందోళనలో బీజేపీ నాయకులు అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి ఎలకంటి సురేష్, పంజాల అశోక్ గౌడ్ మాట్లాడుతూ గజ్వేల్ నుంచి చేగుంటకు వెళ్లే ప్రధాన రహదారిలో ధర్మారెడ్డిపల్లి సమీపంలో రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారి దాదాపు ఏడాది గడుస్తున్నా మరమ్మతు పనులు పూర్తి చేయకపోవడం విచారకరమన్నారు. నిత్యం వందలాది మంది ప్రయాణించే ఈ రహదారిపై గుంతల కారణంగా వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకున్నా అధికారులు స్పందించడం లేదన్నారు. తక్షణమే మరమ్మతు పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామస్తుల సహకారంతో బీజేపీ ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ ధర్నాలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు వంజరి రాజు, ధాతర్పల్లి సర్పంచ్ దివ్య రాజు, మండల ప్రధాన కార్యదర్శులు ఇప్ప స్వామి, బారు అరవింద్, ఉపాధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, బీనమైన ప్రభాకర్, శాతం స్వామి, కార్యదర్శి కూర స్వామి, కోశాధికారి పంజ బాలయ్య, బోయిని సత్యం, రామస్వామి, వాచిని శివప్రసాద్, నగేష్, శ్రీరామ్ రాజు, బీజేవైఎం నాయకులు మహేష్ చారి, సాయికిరణ్, అనిల్, సంతోష్, చందు తదితరులు పాల్గొన్నారు.