ఇంటికి తాళం వేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

28-09-2026 | 06:51pm

రాత్రిపూట దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

గేటెడ్ కమ్యూనిటీలలో భద్రతను పటిష్టం చేసుకోవాలి

జిన్నారం: ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్(IDA Bollaram police station) పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీ(gated community security)ల నివాసితులు, కమ్యూనిటీ ప్రతినిధులు, సెక్యూరిటీ సిబ్బందికి పోలీసులు రాత్రివేళల్లో జరిగే దొంగతనాల(Thefts) నివారణపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద కదలికలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దొంగలు ముందుగా రెక్కీ నిర్వహించి, ఒంటరిగా ఉన్న ఇళ్లు, తాళం వేసి ఉన్న నివాసాలు, భద్రత తక్కువగా ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అందువల్ల కమ్యూనిటీ నివాసితులు, సెక్యూరిటీ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రాత్రి సమయంలో సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహించాలని, ప్రధాన ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలతో పాటు కాంపౌండ్ వాల్, పార్కింగ్ ప్రాంతాలు, ఇతర సున్నితమైన ప్రదేశాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. అవసరమైన చోట అదనపు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకుని భద్రతను మరింత పెంచుకోవాలని తెలిపారు. అదేవిధంగా కమ్యూనిటీల్లో ఏర్పాటు చేసిన CCTV కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో తరచూ తనిఖీ చేయాలని, రాత్రివేళల్లో తగినంత లైటింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.

అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద వాహనాలు లేదా రెక్కీ చేస్తున్నట్లు అనిపించే వ్యక్తులు కనిపిస్తే వారి వాహన నంబర్, దుస్తులు, వెళ్లిన దిశ వంటి వివరాలను గుర్తుంచుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో పొరుగువారికి లేదా కమ్యూనిటీ సెక్యూరిటీ సిబ్బందికి ముందస్తుగా సమాచారం ఇవ్వాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తి, వాహనం లేదా చోరీ ప్రయత్నం కనిపించిన వెంటనే డయల్ 112కు లేదా ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు