ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

28-09-2026 | 06:51pm

జిల్లా కలెక్టర్ కె.హరిత

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై వచ్చే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత(District Collector K. Haritha) అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు, ట్రైనీ కలెక్టర్ జోస్తిన్ జోల్ లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.

జిల్లాలోని దహెగాం మండలం రనవెల్లి గ్రామానికి చెందిన కోలే స్వర్ణలత తన భర్త చనిపోయినందున అతని పేరిట ఉన్న భూమిని తన పిల్లల పేరిట పట్టా మార్పు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఆసిఫాబాద్ మండలం జన్కపూర్ గ్రామానికి చెందిన కుమారస్వామి గ్రామంలో రోడ్ ఆక్రమణతో పాటు బతుకమ్మ గద్దెని కూల్చి స్థలం ఆక్రమించుకొని స్థలానికి పెంచన్ ఏర్పాటుచేసి ప్రధాన రహదారికి వెళ్లకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న విషయంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీ సమర్పించారు.

జైనూర్ మండలం మాణిక్ గూడకు చెందిన జాదవ్ లలితభాయి  తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, నిరుపేద అయిన తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. లింగాపూర్ మండలం పీర్లతండకు చెందిన పంచాయతీ సర్పంచ్ భానోత్ కృష్ణ, ఉపసర్పంచ్ బోడ సీతలు కలిసి వార్డు మెంబర్లను సమావేశనికి పిలవకుండా, ఆమోదం లేకుండా ప్రభుత్వం నుండి వచ్చే నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీ సమర్పించారు.

చింతలమానపల్లి మండలం రుద్రపూర్ గ్రామానికి చెందిన కల్పన తన పేరు మీద ఉన్న భూమికి సంబంధించిన వివరాలను ఆన్లైన్ లో నమోదుచేసి పట్టా పాస్ పుస్తకం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఆసిఫాబాద్ మండలం చిలాటిగూడ గ్రామానికి చెందిన బొమ్మరే మహేష్ తాను దివ్యాంగుడిని అని, నిత్యవసరం కోసం బయటికి వెళ్లడానికి తనకు ఈ.వి. బైక్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

చోర్‌పల్లి గ్రామానికి చెందిన మిట్ట మల్లయ్య కలెక్టరేట్ ఎదుట పెట్రోల్ పోసుకోడానికి ప్రయత్నించగా, జిల్లా కలెక్టర్ స్పందించి మిట్ట మల్లయ్య తన కూతురు గోలెం సమత పేరిట ఉన్న భూమిని తన పేరిట మార్చాలని దరఖాస్తు చేసుకున్నారని, ఈ విషయం సివిల్ మేటర్ కావడంతో పాటు పిఓ ఐటిడిఎ ఏజెన్సీ కోర్టులో గోలెం సమత 2020లో కేసు నమోదు చేయడం వల్ల ఈ విషయాన్ని ఏజెన్సీ కోర్టులో తేల్చుకోవాలని నిర్దేశించారు.

సదరు మిట్ట మల్లయ్య స్వయంగా తన కూతురు, కొడుకుల పేరిట 2024 జూన్ లో భూమిని పార్టిషన్ గా బదలాయింపు చేశారని, అక్టోబర్ 3వ తేదీన కేసు ఏజెన్సీ కోర్టులో విచారణకు ఉందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే దిశగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు