సర్వం శివమయం.. కేతకికి పోటెత్తిన భక్తులు
ఝరాసంగం, నవంబర్ 9 : అష్టతీర్థాల సంగమం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి(Sangameshwara Swamy Temple) భక్తులు(devotees) భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీపావళి అమావాస్యతో పాటు సోమవారం కావడంతో శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావించి స్వామివారి దర్శనం కోసం భక్తులు(devotees) పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు(devotees) పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామున పార్వతీ సమేత సంగమేశ్వర స్వామివారికి నాదస్వరం, సుప్రభాత సేవ, మేలుకొలుపు సేవ, మహారుద్రాభిషేకం నిర్వహించారు.
అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, కుంకుమార్చన, పంచామృత అభిషేకం అనంతరం మహా మంగళ హారతి సమర్పించారు. ఉదయం 4:30 గంటల నుంచి భక్తులకు ధర్మ దర్శనం కల్పించారు. స్వామివారి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. కేతకి ఆలయ పరిసరాలు ఓం నమశ్శివాయ పంచాక్షరి మంత్రంతో ప్రతిధ్వనిస్తుంది.
ఐదేళ్లలోపు పిల్లలున్న కుటుంబాలకు, 50 ఏళ్లు పైబడిన వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దేవస్థానం చైర్మన్ చంద్రశేఖర్, ఈవో శివరుద్రప్ప, స్థానిక ఎస్సె క్రాంతి కురుమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదేవిధంగా బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం, మచ్నూర్, కొల్లూర్, రామలింగేశ్వర దేవస్థానం, ఈదులపల్లి రేవన సిద్దేశ్వర ఆలయం, కుప్పానగర్ గుబ్బడి సంగమేశ్వర స్వామి దేవాలయాల్లో భక్తులు పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు.