సమ్మిట్ లెక్క చెప్పండి!
- గత సదస్సుకు రూ.29.45 కోట్లు.. ఇప్పుడు ఎంత?
- ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
- రాష్ట్ర సమస్యలు వదిలేసి ప్రపంచానికి పాఠాలా?
- భారత్ సమ్మిట్ దేశ వ్యతిరేఖ శక్తుల వేదిక
- కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): భారత్ సమ్మిట్ నిర్వహణకు ప్రజాధనం ఎంత ఖర్చు చేస్తున్నారు? గత సమావేశానికి వెచ్చించిన రూ.29.45 కోట్లతో సాధించిన ప్రయోజనాలేంటి? ఖర్చుల వివరాలు, ఫలితాలపై శ్వేతపత్రం విడుదల చేయగలరా? అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులు కరువుతో అల్లాడుతుంటే, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే, ఉద్యోగులు సమస్యలతో సతమతమవుతుంటే ప్రజాధనంతో అంతర్జాతీయ రాజకీయ వేదికలు ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసమే సమ్మిట్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. భారత్ సమ్మిట్ దేశ వ్యతిరేకుల కలయిక వేదిక అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్ నిర్వహణపై స్పందిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ప్రజాధనం ఖర్చు చేసినప్పుడు ప్రజలకు లెక్కలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వం.. ప్రపంచానికి ప్రజాస్వామ్య పాఠాలు చెప్పడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమిటన్నారు.
భారత్ సమ్మిట్ రాహుల్‌గాంధీ రాజకీయ ప్రచార కార్యక్రమం అని విమర్శించారు. దీంతో దేశ అభివృద్ధికి ఆటంకమని, భారత్‌లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి విదేశీ శక్తులతో కలిసి కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. సమ్మిట్‌లో పాల్గొంటున్న 70 దేశాల ప్రతినిధుల్లో మెజారిటీ వ్యక్తులు ఇండియా విధానాలకు వ్యతిరేకులని స్పష్టం చేశారు. సదస్సులో చర్చించే అంశాలు భారత విదేశాంగ విధానానికి అనుగుణంగా ఉన్నాయా?, వీటిని ప్రజలముందు ఉంచగలరా? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌ను మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. భారత అంతర్గత రాజకీయ వ్యవహారాలపై విదేశీ ప్రతినిధులతో చర్చించే అధికారం కాంగ్రెస్‌కు ఎవరిచ్చారని మండిపడ్డారు.
సమ్మిట్ ఉద్దేశం ఏమిటి?
‘అసలు భారత్ సమ్మిట్ ఉద్దేశం ఏమిటి?, తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించడానికా?, లేక ప్రపంచ దేశాలకు కాంగ్రెస్ రాజకీయ సిద్ధాంతాలను పరిచయం చేయడానికా?’ అని బండి సంజయ్ ప్రశ్నించారు. గత సమ్మిట్‌లో 44 అంశాలతో తీర్మానం చేశారని, అందులో ఎన్ని అమలయ్యాయి?, ఎన్ని దేశాలు ఆ తీర్మానాన్ని ఆచరణలోకి తీసుకున్నాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, కొత్తగా ఎన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయి, ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి, వాటిపై కుదిరిన ఒప్పందాలెన్ని? ఎన్ని కార్యరూపం దాల్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఉద్యోగాలు, ఉపాధి, రైతులకు సాగునీరు, భరోసా, యువత భవిష్యత్తుపై తెలంగాణ సర్కార్‌కు సోయే లేదని బండి సంజయ్ విమర్శించారు.