కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుంది
- మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ
- దిల్ సుఖ్ నగర్ లోని సాయి సంజీవిని దవాఖానలో
కండక్టర్ ను పరామర్శించిన మంత్రి పొన్నం
ఎల్బీనగర్, అక్టోబర్ 27: ఖమ్మం జిల్లాలో చిల్లర కోసం జరిగిన వాగ్వాదంలో ప్రయాణికురాలు తోసివేయడంతో ఆర్టీసీ కండక్టర్ తీవ్రంగా గాయపడింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లో ఉన్న సాయి సంజీవిని దవాఖానకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం గాయపడిన ఆర్టీసీ కండక్టర్ ప్రవళికను మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పరామర్శించారు.
ప్రవళిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ప్రజలను వారి గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ సిబ్బంది పట్ల ప్రయాణికులు గౌరవంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.
సిబ్బంది ప్రవర్తనపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే ఆర్టీసీ అధికారులకు తెలియజేయాలని, ఉద్యోగుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖమ్మం ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం మరియు సంస్థ పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్న ఆర్టీసీకి ప్రజల మద్దతు ఎంతో అవసరమని కోరారు.