ఇందిరమ్మ గూడు లబ్ధిదారుల గోడు
- అందని తుది విడత సాయం
- గృహప్రవేశం చేసి నెలలైనా నిరీక్షణే..
- కేంద్రం వాటా నిధుల విడుదలలో తీవ్ర జాప్యం
- రూ.1,440 కోట్లకు ఇచ్చింది రూ.101 కోట్లే
- రూ.72వేలు కోత పెట్టి మిగతా సొమ్మునే జమచేస్తున్న రాష్ట్రం
హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): సొంతింటి కల నెరవేరింది.. అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారు.. గృహప్రవేశం కూడా చేశారు. కానీ, ఇంటి నిర్మాణానికి రావాల్సిన చివరి విడత సాయం మాత్రం అందలేదు. నెలలు గడుస్తున్నా బిల్లు రాకపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు(Indiramma Housing Beneficiaries) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రం వాటా నిధుల జాప్యం.. ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పీఎంఏవై (గ్రామీణ) పథకం కింద మంజూరైన ఇళ్లకు కేంద్రం తన వాటాను పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ మొత్తాన్ని మినహాయించి మిగతా సొమ్మునే చెల్లిస్తోంది. దీంతో ఇల్లు పూర్తయిన పేదలు చివరి బిల్లు కోసం నిరీక్షించాల్సి వస్తోంది.
రాష్ట్రంలో పేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయగా.. రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లు కేటాయించేందుకు కార్యాచరణ చేపట్టింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతల్లో రూ.5 లక్షల సాయం అందిస్తోంది. దీనికి అదనంగా కేంద్రం కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజ న (పీఎంఏవై) పథకం కింద రాష్ట్రానికి 2 లక్ష ల ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి రూ.72 వేల చొప్పున కేంద్ర వాటా అందనుంది. వీటితో పాటు ఉపాధిహామీ పథకం కింద రూ.30 వేలు, మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.10 వేలు కేంద్రం నుంచి అందుతాయి.
రూ.1,339 కోట్లు పెండింగ్..
ఇంటి నిర్మాణం పురోగతిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా సాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే కేంద్రం నుంచి రావాల్సిన రూ.72 వేల వాటాను మినహాయించి మిగతా మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తోంది. పీఎంఏవై కింద మంజూరైన 2 లక్షల ఇళ్లకు కేంద్రం నుంచి సుమారు రూ.1,440 కోట్లు రావాల్సి ఉండగా.. ఇప్పటివరకు విడుదలైన మొత్తం కేవలం రూ.101 కోట్లేనని అధికారులు చెబుతున్నారు. దీంతో దాదాపు రూ.1,339 కోట్ల కేంద్ర వాటా పెండింగ్లో ఉంది.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత ఇళ్ల నిర్మాణానికి ఇప్పటివరకు సుమారు రూ.9 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇల్లు పూర్తయి గృహప్రవేశం చేసినా కేంద్రం వాటా అందకపోవడంతో లబ్ధిదారులకు తుది చెల్లింపులు నిలిచిపోతున్నాయి. కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా చెల్లించేందుకు వెనుకాడుతోంది. ఒకవేళ రాష్ర్టం తనవంతుగా పూర్తి సాయం అందిస్తే.. ఆ తర్వాత కేంద్రం నుంచి నిధులు విడుదలైనప్పుడు లబ్ధిదారుల నుంచి ఆ మొత్తాన్ని తిరిగి వసూ లు చేయడం కష్టమవుతుందన్నది అధికారుల ఆలోచనగా ఉంది. ఫలితంగా రెండు ప్రభుత్వాల మధ్య లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.
వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు..
నిర్దేశిత సమయంలో పూర్తి కావాలని అధికారులు ఒత్తిడి చేయడంతో పలువురు లబ్ధిదారులు అప్పులు చేసి ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. గృహప్రవేశాలు చేసుకున్న తర్వాత బకాయి సొమ్ము అందుతుందని ఆశించినా నిరీక్షణ తప్పడం లేదు. అప్పులకు వడ్డీలు చెల్లించలేక, కుటుంబ ఖర్చులు నెట్టుకురాలేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా ఆర్థిక భారం తగ్గకపోవడంతో ప్రభుత్వాలు త్వరగా స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా తొలి విడతలో మంజూరైన 4.50 లక్షల ఇళ్లలో ఇప్పటివరకు 2.21 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 1.90 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉండగా.. సుమారు 40 వేల ఇళ్ల నిర్మాణాలు ఇంకా ప్రారంభం కాలేదని తెలుస్తోంది. ఇప్పటికే పూర్తయిన ఇళ్లకే తుది బిల్లులు అందకపోవడంతో మిగతా ఇళ్ల నిర్మాణాల పురోగతిపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.