సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

19-09-2026 | 11:44pm

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ 

భూపాలపల్లి,(విజయక్రాంతి): సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు(MLA Gandra Satyanarayana Rao) అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఐడీఓసీ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma)తో కలిసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గురువును మించిన దైవం లేదని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని అన్నారు. ఉపాధ్యాయుల బోధన, మార్గదర్శకత్వంతో ఎంతోమంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, వైద్యులు, ఇంజినీర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారని తెలిపారు.

తన గురువులను గుర్తు చేసుకున్న ఎమ్మెల్యే 

తన చిన్ననాటి విద్యాభ్యాసాన్ని గుర్తుచేసుకున్న ఎమ్మెల్యే.. గణపురం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన తన గురువు గోపాల్‌రావు ఉచితంగా ట్యూషన్ చెప్పి తన విద్యాభివృద్ధికి తోడ్పడ్డారని తెలిపారు. తాను సాంఘిక సంక్షేమ వసతి గృహంలో 8, 9, 10 తరగతులు చదువుకున్నానని, తాను ఈ స్థాయికి ఎదగడానికి గురువులు అందించిన విద్య, మార్గదర్శకత్వమే ప్రధాన కారణమని పేర్కొన్నారు.

గత పదేళ్లుగా నిలిచిపోయిన డీఎస్సీ నియామకాలను పునరుద్ధరించి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో 11 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించి తల్లిదండ్రులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధన, ప్రీ-ప్రైమరీ విద్యార్థులకు అల్పాహారం, విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయాలి

విద్యార్థుల అభివృద్ధితో పాటు సమాజ పురోగతిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రుల తర్వాత పిల్లలు పాఠశాలలో ఉపాధ్యాయులనే ఆదర్శంగా భావిస్తారని పేర్కొన్నారు. విద్యార్థుల్లో మంచి గుణాలు, క్రమశిక్షణ, విలువలు పెంపొందించడంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి ఉపాధ్యాయులు దిశానిర్దేశం చేస్తారని అన్నారు.

తాను కూడా ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చానని, తన తండ్రి రిటైర్డ్ ప్రిన్సిపాల్‌గా, తల్లి రిటైర్డ్ లెక్చరర్‌గా సేవలందించారని కలెక్టర్ గుర్తుచేశారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహనీయులు సైతం బోధనా వృత్తిని ఎంతో గౌరవించారని తెలిపారు. జిల్లాలో ఉపాధ్యాయులు యువతను సన్మార్గంలో నడిపిస్తూ, విద్యార్థులను ఉన్నత లక్ష్యాల వైపు ప్రోత్సహించాలని సూచించారు.

ఈ సందర్భంగా ఉత్తమ సేవలందిస్తున్న ఉపాధ్యాయులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, జిల్లా విద్యాశాఖ అధికారి లలిత, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు